Kidney Stones vs Gallbladder Stones: కిడ్నీలో రాళ్లే కాదు ఇవి కూడా డేంజరే.. లక్షణాలు ఏంటంటే..
ABN , First Publish Date - 2023-04-04T11:28:46+05:30 IST
గాల్ బ్లాడర్ స్టోన్స్‌ని కిడ్నీ స్టోన్స్ అని పొరబడే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే రెండూ కడుపులో ఒక రకమైన ఇబ్బందికి కారణమవుతాయి. వీటి కారణంగా కడుపులో వికారం, వాంతులు, జ్వరం వంటి హెల్త్ సమస్యలు ఫేస్ చేస్తుంటారు.
ఓ వ్యక్తికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. మనకు వెంటనే తట్టే విషయం ఏంటంటే కిడ్నీలో రాళ్లు. వెంటనే హాస్పిటల్‌కు వెళితే పరీక్షల్లో అవి గాల్‌బ్లాడర్‌లో ఏర్పడిన స్టోన్స్ అని తేలింది. అసలు తమకు సమస్య ఏంటనే విషయం తెలియకుంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది. గాల్ బ్లాడర్ స్టోన్స్‌ని కిడ్నీ స్టోన్స్ అని పొరబడే అవకాశం చాలా ఎక్కువ. ఎందుకంటే రెండూ కడుపులో ఒక రకమైన ఇబ్బందికి కారణమవుతాయి. వీటి కారణంగా కడుపులో వికారం, వాంతులు, జ్వరం వంటి హెల్త్ సమస్యలు ఫేస్ చేస్తుంటారు. అయితే గాల్ బ్లాడర్ నొప్పి సాధారణంగా కుడి ఎగువ పొత్తికడుపులో వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మూత్రపిండ రాయి నొప్పి పార్శ్వానికి రెండు వైపులా వస్తుంది. కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ రెండూ మన శరీరంలోని ఫ్లూయిడ్ ఫ్లోని నిలిపివేయగలవు. దీంతో విపరీతమైన నొప్పి వస్తుంది. దీనికి వెంటనే ఆసుపత్రిలో చేరి సరైన చికిత్స పొందాల్సి ఉంటుంది.
గాల్ బ్లాడర్‌లో రాళ్లు కొలెస్ట్రాల్‌తో తయారైతే, మూత్రపిండాల్లో రాళ్లు కాల్షియం లవణాలతో తయారవుతాయి. శరీరం బైల్ (పిత్తం)లో ఎక్కువ కొలెస్ట్రాల్‌ను విసర్జించినప్పుడు, అది గ్లాల్‌బ్లాడర్‌లో నిక్షిప్తమై స్ఫటికాలు, రాళ్లను ఏర్పరుస్తుంది. అదనపు కాల్షియం కిడ్నీలో చేరినప్పుడు, అది రాళ్లను ఏర్పరుస్తుంది. ఇదీ రెండింటిలో రాళ్లు తయారయ్యే విధానమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే గాల్‌బ్లాడర్ రాళ్ల కంటే కిడ్నీ రాళ్లు ఎక్కువగా తయారవుతుంటాయి. వాస్తవానికి గాల్‌బ్లాడర్ స్టోన్స్ ఆడవారిలో, ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కాగా.. గాల్‌బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ కొన్ని సమాన లక్షణాలను కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. శరీరం తొలగించడానికి అవసరమైన పదార్థాల చేరిక వల్ల రెండూ ఏర్పడతాయి. ఈ రెండు తీవ్రమైన కడుపు నొప్పి, వికారం, వాంతులతో ఇబ్బంది పెడతాయి. కిడ్నీ , గాల్‌బ్లాడర్ స్టోన్స్ రెండూ కూడా ఇన్‌ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ లేదా మూత్ర లేదా పిత్త వాహికను అడ్డుకోవడం వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉందని యూరాలజీ, యూరో ఆంకాలజీ నిపుణులు చెబుతున్నారు.
గాల్‌బ్లాడర్ స్టోన్స్ లక్షణాలు..
కడుపు కుడి ఎగువ భాగంలో నొప్పి
భుజం బ్లేడ్‌ల మధ్య వెన్నునొప్పి
వికారం లేదా వాంతులు
అజీర్తి, అజీర్ణం
కిడ్నీలో స్టోన్స్ లక్షణాలు..
పార్శ్వ లేదా వెన్నునొప్పి సాధారణంగా గజ్జలకు వ్యాపిస్తుంది.
వికారం లేదా వాంతులతో కూడిన నొప్పి
మూత్రంలో రక్తం
చలి జ్వరం
దుర్వాసనతో కూడిన మూత్రం.
మూత్రవిసర్జన సమయంలో మంట
కిడ్నీ పనిచేయకపోవడం