Pregnancy: పిల్లలు కలగకపోవడానికి ఇవే ప్రధాన కారణాలు కావొచ్చు!
ABN , First Publish Date - 2023-03-28T13:15:26+05:30 IST
గర్భధారణ జరగాలంటే, వీర్యకణాలతో పాటు, వాటిలోని జన్యు పదార్థం ఆరోగ్యంగా ఉండాలి. అండాలను చేరుకోవడం కోసం పయనించే జన్యు పదార్థానికి వీర్యం
గర్భధారణ జరగాలంటే, వీర్యకణాలతో పాటు, వాటిలోని జన్యు పదార్థం ఆరోగ్యంగా ఉండాలి. అండాలను చేరుకోవడం కోసం పయనించే జన్యు పదార్థానికి వీర్యం ఓ వాహకంలా ఉపయోగపడుతుంది. అయితే వీర్యంలో లోపాలు ఉన్నా, వీర్యకణాల్లోని జన్యుపదార్థంలో లోపాలు ఉన్నా అండం ఫలదీకరణ జరగదు. ఒకవేళ జరిగినా మూడు నెలలు తిరగకుండానే అబార్షన్ అయిపోతూ ఉంటుంది. సాధారణంగా గర్భం దాల్చకపోవడానికి మహిళల మీదే అపవాదు మోపుతూ ఉంటారు. కానీ దీనిలో పురుషులకూ సమ బాధ్యత ఉంటుంది. ఇందుకు ప్రధాన కారణాలు.....
పరిమాణం: వీర్య పరిమాణం సుమారుగా 1.5 మిల్లీ లీటర్ల నుంచి 2 మిల్లీ లీటర్ల పరిమాణం ఉండాలి. ఇంతకంటే తక్కువ ఉంటే గర్భం దాల్చే అవకాశాలు తగ్గుతాయి.
వీర్యకణాల సంఖ్య: గర్భధారణకు అవసరమైన వీర్యకణాల సంఖ్య, ఒక మిల్లీలీటరుకు 15 మిలియన్ల నుంచి 30 మిలియన్లు ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే సమస్య ఉన్నట్టు భావించాలి.
రంగు: వీర్యం రంగు తెల్లగా ఉండాలి. పచ్చగా ఉంటే ఇన్‌ఫెక్షన్ ఉన్నట్టు, ఎర్రగా ఉంటే వీర్యంలో రక్తం కలుస్తున్నట్టు అర్థం. ఈ సమస్యలు ఉన్నా గర్భధారణ సాధ్యపడదు.
చిక్కదనం: వీర్యం జిగటగా ఉండాలి. నీళ్లలా ఉంటే హర్మోన్ల సమస్య ఉందని అందని అర్థం. ఇలాంటి పల్చని వీర్యం వల్ల గర్భధారణ జరగదు.
వీర్యం కరిగే తత్వం: చిక్కగా ఉండే వీర్యం గది ఉష్ణోగ్రత దగ్గర 15 నిమిషాల్లో కరిగిపోవాలి. ఇలా జరగకపోతే వీర్యంలో ఇన్‌ఫెక్షన్ ఉందని అనుకోవాలి. ఇన్‌ఫెక్షన్ గర్భధారణకు ప్రధాన అడ్డంకి!
చీము కణాలు: వీర్యంలో చీము కణాలు ఉంటే, ఇన్‌ఫెక్షన్ ఉందని అర్థం చేసుకోవాలి. అందుకు లోతైన పరీక్షలు అవసరం అవుతాయి.
కదలికలు: వీర్యంలో కదిలే శుక్రకణాలు 32% ఉంటే సరిపోతుంది. అంతకంటే తక్కువ ఉంటే సమస్య ఉందని భావించాలి.
శుక్ర కణం నిర్మాణం: శుక్ర కణం, తల, తోక, ఆకార నిర్మాణంలో లోపాలు. ఈ లోపాల కారణంగా శుక్రకణం అండంలోకి ప్రవేశించలేదు.
అతుక్కుపోయి ఉండడం: వీర్యకణాలు స్వతంత్రంగా కదలకుండా, ఒకదానికి మరొకటి అతుక్కుపోయి ఉండవచ్చు. ఇందుకు ఇన్‌ఫెక్షన్లే కారణం.
వృషణాల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం: బిగుతైన లోదుస్తులు ధరించడం, ఎక్కువ సమయం పాటు కుర్చీల్లో కూర్చుని పని చేయడం, వేడితో కూడిన వాతావరణంలో పని చేయడం (వంటవాళ్లు, కొలిమి దగ్గర పనిచేసే వాళ్లు) వల్ల వృషణాల ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా శుక్రకణాల నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి వదులుగా ఉండే దుస్తులు ధరించడం అలవాటు చేసుకోవాలి.