Periods: ఆ సమస్యను ఎలా భావించాలి?

ABN , First Publish Date - 2023-07-06T11:27:31+05:30 IST

మహిళల జీవితంలో రుతుస్రావం ఒక ముఖ్యమైన విషయం. ఆరోగ్యకరమైన మహిళకు ప్రతి నెల రుతుస్రావం తప్పనిసరిగా వస్తుంది. అయితే ఆధునిక జీవనంలో ఒత్తిడి వల్ల రుతుస్రావం ఆలస్యం కావటం సామాన్యమైపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన కారణాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం.

Periods: ఆ సమస్యను ఎలా భావించాలి?

నేను ఒక కార్పొరేట్‌ ఆఫీసులో పనిచేస్తున్నా. మా కొలిగ్స్‌లో చాలా మంది పిరియడ్స్‌ సక్రమంగా రావటం లేదని చెబుతూ ఉంటారు. నాకు కూడా కొన్ని సార్లు పిరియడ్స్‌ ఆలస్యమవుతూ ఉంటాయి. పిరియడ్స్‌ ఆలస్యం కావటాన్ని ఒక సమస్యగా భావించాలా? లేక ఇది సాధరణమైన విషయమేనా?

-షాలిని, హైదరాబాద్‌

మహిళల జీవితంలో రుతుస్రావం ఒక ముఖ్యమైన విషయం. ఆరోగ్యకరమైన మహిళకు ప్రతి నెల రుతుస్రావం తప్పనిసరిగా వస్తుంది. అయితే ఆధునిక జీవనంలో ఒత్తిడి వల్ల రుతుస్రావం ఆలస్యం కావటం సామాన్యమైపోయింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన కారణాలను అర్థం చేసుకోవటానికి ప్రయత్నిద్దాం.

గర్భనియంత్రణ పద్ధతులు

గర్భనిరోధక పద్ధతులను ఉపయోగిస్తున్నప్పుడు రుతుస్రావంలో కొన్ని మార్పులు వస్తాయి. కొందరికి రుతుస్రావం అస్సలు రాకపోవచ్చు. మరికొందరికి చాలా ఎక్కువగా ఉండవచ్చు. మరి కొందరిలో ఆలస్యం కావచ్చు. ఇలాంటి సమస్యలు ఎదురయినప్పుడు డాక్టర్‌కు చూపించుకోవటం మంచిది.

పాలు ఇస్తున్నప్పుడు..

పాలిచ్చే తల్లులలో ప్రొలేక్టిన్‌ అనే హార్మోన్‌ ఎక్కువగా ఉంటుంది. ఈ హార్మోన్‌ అండాలు విడుదలకాకుండా అడ్డం పడుతూ ఉంటుంది. సాధారణంగా పిల్ల పుట్టిన ఒక నెల దాకా రుతుస్రావం రాదు. ఆ తర్వాతి కాలంలో పిల్లలకు పాలు ఇవ్వటం మానేసిన తర్వాత మళ్లీ రుతుస్రావం ప్రారంభం అవుతుంది.

మోనోపాజ్‌ ముందు..

మోనోపాజ్‌ వచ్చే నాలుగు ఏళ్ల ముందు నుంచి రుతుస్రావం ఆగిపోయే అవకాశముంది. లేకపోతే అప్పుడప్పుడు మాత్రమే వస్తుంది. 45 ఏళ్లు దాటిన వాళ్లలో రుతుస్రావ సమస్యలు ఎదురయితే దానిని ప్రీమోనోపాజ్‌ కారణమని భావించవచ్చు.

ఒత్తిడి..

విపరీతమైన ఒత్తిడి వల్ల కూడా రుతుస్రావం సరిగ్గా రాదు. 2021లో కోవిడ్‌ వచ్చిన కొత్తలో శాస్త్రవేత్తలు ‘‘రుతుస్రావంపై ఒత్తిడి ప్రభావం’’ అనే అంశంపై అధ్యయనం చేశారు. దీని ప్రకారం - కోవిడ్‌ ఒత్తిడి వల్ల ఈ అధ్యయనంలో పాల్గొన్న 54 శాతం మందికి రుతుస్రావం ఆగిపోయింది. కేవలం కోవిడ్‌ వల్లే కాకుండా దైనందిక జీవనంలో ఎదురయ్యే ఒత్తిళ్ల వల్ల కూడా రుతుస్రావం ఆగిపోతుందని భావించవచ్చు.

థైరాయిడ్‌ సమస్య

థైరాయిడ్‌ హార్మోన్‌ సరిగ్గా పనిచేయకపోవటం వల్ల రుతుస్రావ సమస్యలు ఏర్పడతాయి. థైరాయిడ్‌ గ్లాండ్‌ సరిగ్గా పనిచేయకపోవటాన్ని హైపోథైరాయిడిజం అంటారు. దీని వల్ల కొందరిలో రుతుస్రావం చాలా ఎక్కువగా అవుతుంది. కొందరిలో థైరాయిడ్‌ గ్లాండ్‌ అవసరమైన దానికన్నా ఎక్కువగా పనిచేస్తుంది. దీనిని హైపర్‌ థైరాయిడిజం అంటారు. దీని వల్ల రుతుస్రావం తక్కువగా అవుతుంది. అందువల్ల రుతుస్రావ సమస్యలు ఉన్నవారు థైరాయిడ్‌ పరీక్షను చేయించుకోవటం మంచిది.

Updated Date - 2023-07-06T11:27:31+05:30 IST