Sweet corn: మొక్క జొన్నతో ఎన్ని ఉపయోగాలో..!
ABN , First Publish Date - 2023-08-14T12:39:04+05:30 IST
వర్షాకాలం వచ్చిందంటే చాలు మొక్కజొన్న పొత్తులుకు భలే గిరాకీ, వేడివేడి నిప్పులపై కాల్చి ఉప్పు, నిమ్మరసం పట్టించిన మొక్కజొన్న పొత్తులు తినేందుకు జనం ఇష్టపడతారు. ఈసీజన్‌లో లభించే వీటితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
వర్షాకాలం వచ్చిందంటే చాలు మొక్కజొన్న పొత్తులుకు భలే గిరాకీ, వేడివేడి నిప్పులపై కాల్చి ఉప్పు, నిమ్మరసం పట్టించిన మొక్కజొన్న పొత్తులు తినేందుకు జనం ఇష్టపడతారు. ఈసీజన్‌లో లభించే వీటితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. మొక్కజొన్న రెండు రకాలుగా లభిస్తుంది. మొదటిది సాధారణమైంది, రెండవది స్వీట్‌కార్న్. రోజుకు ఒక మొక్కజొన్న పొత్తు తినవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో మొక్క జొన్న పొత్తులు విరివిగా లభిస్తున్నాయి. సీజన్‌తో సంబంధం లేకుండా సంవత్సరం పొడవునా స్వీట్‌కార్న్ లభిస్తుంది. ఎక్కువ మంది స్వీట్‌కార్న్ తినేందుకు ఆసక్తి చూపుతారు. ఎందుకంటే ఇందులో పైబర్ ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్‌లు, యాంటీ ఆక్సిడెంట్‌లు, విటమిన్‌లు, ఫైటో కెమికల్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటితో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. పిండిలా చేసుకుని గారెలు, వాటిని రుబ్బుకుని పాయసంలా చేసుకుని ఆరగిస్తారు. మొక్కజొన్న తింటే వాటిలో ఉండే పోషకాల వలన శరీరంలో బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. స్వీట్‌కార్న్‌లో విటమిన్ బి, సితోపాటు థయామిన్, పాంటోథెనిక్ యాసిడ్, ఫోలేట్స్, రైబోఫ్లేవిన్ వంటివి జీర్ణక్రియ సక్రమంగా సాగడంలో తోడ్పడతాయి. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. అనేక రకాల క్యాన్స్‌ర్‌ల నివారణకు దోహదపడుతుంది.
విటమిన్ బి12 పుష్కలం
మొక్కజొన్నలో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్, ఐరన్ కూడా అధికం. ఇవన్నీ శరీరంలో ఎర్రరక్త కణాల అభివృద్ధిలో దోహద పడతాయి.
తక్కువ బరువుతో భాదపడుతున్న వారు మొక్క జొన్న తింటే మంచి ఫలితం ఉంటుంది. దీనిలో పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.
ఆహారం జీర్ణం అవడంలో ఉపకరిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ.
మొక్క జొన్నలో బీటా కెరోటిన్ ఎక్కువ. 100 గ్రాముల గింజలు తింటే ఒక రోజుకు అవసరమైన విటమిన్-ఎ లభిస్తుంది.
మొక్క జొన్నలో ఫెలోరిక్ యాసిడ్ అనే శక్తి వంతమైన యాంటీయాక్సిడెంట్ ఉంటుంది. దీనికి అనేక రకాల క్యాన్సర్‌లను నివారించే సామర్థ్యం ఉంటుంది.
వయసు పెరుగుతున్నప్పుడు కనిపించే దుష్ప్రభావాలను కూడా అరికడుతుంది. గాయమైనప్పుడు వాపు, మంట, నొప్పులను తగ్గిస్తుంది.
మొక్క జొన్నలో మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్ ఉంటాయి. దీని వల్ల ఎముకలు గట్టి పడతాయి.
మొక్క జొన్న నూనెలో ఉండే లీనోలే యాసిడ్ చర్మం మంటలను తగ్గిస్తుంది. దీనిలో ఉండే సి-విటమిన్ కెరోటాయిడ్లు, మయోప్రఫినాయిడ్లు, చెడు కొలెస్ర్టాల్ నుంచి గుండెను కాపాడతాయి.
పసుపు రంగులో ఉండే మొక్క జొన్న గింజల్లో మినరల్స్ అధికంగా ఉంటాయి. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతుంది.
మొక్క జొన్నలో ఫోలిక్ యాసిడ్ ఉండటం వల్ల రక్త హీనతను తగ్గిస్తుంది.
గర్భిణుల్లో ఫోలిక్ యాసిడ్ తగ్గితే అది బేబీ బరువును తగ్గిస్తుంది.
హైదరాబాద్, షాపూర్‌నగర్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి)