Hair: జుట్టు పలుచబడుతోందా? అయితే కారణమిదే..!
ABN , First Publish Date - 2023-08-10T12:15:29+05:30 IST
తలస్నానం చేసిన ప్రతిసారీ కుచ్చులు కుచ్చులుగా వెంట్రుకలు రాలిపోతున్నా, దువ్విన ప్రతిసారీ వందకు మించి వెంట్రులకు ఊడిపోతున్నా జుట్టు రాలే సమస్య ఉన్నట్టు భావించాలి. అంతకంటే ముఖ్యంగా మూల కారణాన్ని కనిపెట్టి, సరిదిద్దుకోవాలి.
తలస్నానం చేసిన ప్రతిసారీ కుచ్చులు కుచ్చులుగా వెంట్రుకలు రాలిపోతున్నా, దువ్విన ప్రతిసారీ వందకు మించి వెంట్రులకు ఊడిపోతున్నా జుట్టు రాలే సమస్య ఉన్నట్టు భావించాలి. అంతకంటే ముఖ్యంగా మూల కారణాన్ని కనిపెట్టి, సరిదిద్దుకోవాలి.
థైరాయిడ్ సమస్యలు
హైపోథైరాయిడిజం (థైరాయిడ్ గ్రంథి అవసరానికి తగ్గట్టు పని చేయకపోవడం), హైపర్ థైరాయిడిజం (థైరాయిడ్ గ్రంథి అవసరానికి మించి పని చేయడం) ఈ రెండు సమస్యల్లో వెంట్రుకలు రాలతాయి. అయితే ఈ సమస్య ఉన్నప్పుడు, ఒకే చోట కాకుండా తలంతా సమంగా వెంట్రుకలు రాలుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు థైరాయిడ్ పరీక్షతో సమస్యను నిర్థారించకుని, చికిత్స తీసుకుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది.
జన్యుపరం
కొంతమందికి జన్యుపరంగా తల పలుచనయ్యే సమస్య సంక్రమిస్తుంది. దీన్ని ఆండ్రోజెనిటిక్ అలోపేసియా అంటారు. తల్లి లేదా తండ్రి నుంచి పిల్లలకు ఈ జన్యువులు సంక్రమిస్తాయి. వెంట్రుకలు రాలే వేగాన్ని నియంత్రించడంతో పాటు, తిరిగి వెంట్రుకలు పెరిగేలా చేయడం కోసం వైద్యులు సూచించే ప్రత్యేకమైన షాంపూలు, మందులు వాడుకోవలసి ఉంటుంది.
మెనోపాజ్
మెనోపాజ్‌లో తల పలుచనవడం సర్వసామాన్యం. అయితే ఈ సమస్య తీవ్రంగా ఉంటే, న్యూట్రిషన్, ఒత్తిడి, మెటబాలిక్ మార్పులను అనుమానించాలి. ఈ సమస్యను సరిదిద్దడం కోసం జీవనశైలి మార్పులు చేసుకోవాలి. పోషకాహారం, విటమిన్లు తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయాలి. హార్మోన్ థెరపీతో కూడా ఫలితం ఉంటుంది.