Self Deprecation: ఆత్మన్యూనత వేధిస్తోందా? అయితే ఇలా బయటపడండి!
ABN , First Publish Date - 2023-07-01T11:48:34+05:30 IST
మనం జీవితకాలంలో అలవరుచుకునే కొన్ని అలవాట్లు ఆత్మ స్థైర్యాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే ఆ అలవాట్లను కనిపెట్టి వాటిని సరిదిద్దుకోగలిగితే ఆత్మన్యూనత దూరమవుతుంది.
మనం జీవితకాలంలో అలవరుచుకునే కొన్ని అలవాట్లు ఆత్మ స్థైర్యాన్ని ప్రభావితం చేస్తాయి. అయితే ఆ అలవాట్లను కనిపెట్టి వాటిని సరిదిద్దుకోగలిగితే ఆత్మన్యూనత దూరమవుతుంది.
నెగటివ్ సెల్ఫ్ టాక్: మనల్ని మనం స్వీయ విమర్శ చేసుకోవడం, తక్కువ చేసి మాట్లాడడం సరి కాదు. మనలోని తప్పుల మీద దృష్టి పెట్టి, వాటి గురించే ఆలోచిస్తూ ఉండడం వల్ల ఆత్మన్యూనతకు లోనవుతాం. మనల్ని మనం తక్కువచేసి మాట్లాడే అలవాటు వల్ల మనలో ఏదో లోపం ఉన్న భావనకు లోనవుతాం. కాబట్టి పాజిటివ్ సెల్ఫ్ టాకింగ్ అలవాటు చేసుకోవాలి. అలాగే మన గురించి చెప్పుకునేటప్పుడు, మన మాటల మీద దృష్టి పెట్టాలి. ఇలాంటి ధోరణి ఆరోగ్యకరమైన సెల్ఫ్ ఇమేజ్‌కు సహాయపడుతుంది.
పర్ఫెక్షనిజం: సాధ్యం కాని లక్ష్యాలను ఏర్పరుచుకుని, నిరంతరంగా పర్ఫెక్షన్ కోసం పాకులాడడం ద్వారా, ఆత్మ స్థైర్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. పర్ఫెక్షనిస్టులు విపరీతమైన స్వీయ విమర్శనా లక్షణాన్ని కలిగి ఉంటారు. వాళ్లంతట వాళ్లు ఏర్పరుచుకున్న శక్తికి మించిన లక్ష్యాలను చేరుకోలేకపోయినప్పుడు తమలో ఏదో లోపం ఉందనే అభిప్రాయానికి వచ్చేస్తారు.
నిరంతరం పోల్చుకోవడం: అప్పియరెన్స్, విజయాలు, సామాజిక స్థోమతల పరంగా నిరంతరంగా ఇతరులతో పోల్చుకోవడం కూడా సరి కాదు. ఇలాంటి లక్షణం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌కు దారి తీస్తుంది. స్వీయ విలువను గ్రహించనీయకుండా చేస్తుంది. ప్రతి ఒక్కరి ప్రయాణం భిన్నంగా ఉంటుంది. కాబట్టి వేరొకరి మనల్ని మనం పోల్చుకోవడమనేది అవివేకం.
నెగిటివ్ బాడీ లాంగ్వేజ్: శరీరంలో లేని లోపాలను భూతద్దంలో చూసుకుంటూ కుంగిపోవడం కూడా ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తుంది. సామాజిక సౌందర్య ప్రమాణాలు, ‘ఐడియల్ బాడీ’ గురించిన సామాజిక మాధ్యమాల ప్రాధామ్యాలు అసంతృప్తికి, ఆత్మ న్యూనతకూ దారి తీస్తాయి. కాబట్టి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదు.
సవాళ్ల నుంచి తప్పించుకోవడం: ఓడిపోతామనే భయంతో కొత్త సవాళ్లూ, పరీక్షల నుంచి తప్పించుకోవడం వల్ల వ్యక్తిత్వ ఎదుగుదల ఆగిపోతుంది. ఈ అలవాటు వల్ల మన అసలు సామర్థ్యాన్ని గ్రహించే అవకాశాలను కోల్పోతాం.
క్షమాపణలు కోరడం: చిన్న చిన్న పొరపాట్లకే క్షమాపణలు కోరడం, మన నియంత్రణలో లేని విషయాలకు బాధ్యతను ఆపాదించుకోవడం వల్ల ఆత్మ స్థైర్యం కుంటుపడుతుంది.
స్వీయ శ్రద్ధ: వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, నిద్ర, విశ్రాంతి... వీటిని నిర్లక్ష్యం చేయడం వల్ల శరీరం మీదా, మనసు మీదా ప్రభావం పడుతుంది. ఇలాంటి నిర్లక్ష్యం అంతిమంగా ఆత్మ న్యూనతకు దారి తీస్తుంది. మనం పెట్టవలసిన అతి పెద్ద పెట్టుబడి మనమే! ఫలితంగా మన ఊహకందనంత ప్రయోజనాన్ని పొందగలుగుతాం!