Missiles Strike: పుతిన్ ప్రసంగం వేళ.. ఉక్రెయిన్‌ నగరంపై రష్యా క్షిపణుల దాడి, ఆరుగురు మృతి

ABN , First Publish Date - 2023-02-21T19:52:40+05:30 IST

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయినా మంగళవారంనాడు కూడా దాడులు కొనసాగాయి. రష్యా క్షిపణులు ఉక్రెయిన్‌లోని ఖెర్సాన్ సిటీ మార్కెట్‌ను తాకడంతో ..

Missiles Strike: పుతిన్ ప్రసంగం వేళ.. ఉక్రెయిన్‌ నగరంపై రష్యా క్షిపణుల దాడి, ఆరుగురు మృతి

ఖెర్సాన్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయినా మంగళవారంనాడు కూడా దాడులు కొనసాగాయి. రష్యా క్షిపణులు (Russian Missiles) ఉక్రెయిన్‌లోని ఖెర్సాన్ సిటీ మార్కెట్‌ను తాకడంతో సుమారు ఆరుగురు మృత్యువాత పడ్డారు. 12 మంది వరకూ గాయపడ్డారు. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఆర్మీ సదరన్ కమాండ్ వ్లాడిస్లేవ్ నజరోవ్ తెలిపారు. పుతిన్ ప్రసంగిస్తున్న సమయంలోనే రష్యా క్షిపణలు విరుచుకుపడ్డాయని, కొందరు ఇళ్లలోనూ మరికొందరు రోడ్లపైన గాయపడ్డారని, మృత్యువాతపడ్డారని చెప్పారు.

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలై ఏడాది పూర్తి అయిన తరుణంలో దేశాన్ని ఉద్దేశించి పుతిన్ సోమవారంనాడు ప్రసంగించారు. ఉక్రెయిన్‌పై దాడికి వెళ్లడానికి పశ్చిమ దేశాలే కారణమని ఆయన ఆరోపించారు. ఉక్రెయిన్ పౌరులతో రష్యా యుద్ధం చేయడం లేదని, ఉక్రెయిన్ పాలకుల పైనే తమ యుద్ధమని చెప్పారు. రష్యా వస్తుందని, తమను ఆదుకుంటుందని డాన్‌బాస్ ఎంతో నమ్మకంతో ఎదురుచూస్తోందని పుతిన్ అన్నారు. డాన్‌బాస్‌పై కివ్ కఠిన చర్యలను తిప్పికొట్టేందుకు సన్నద్ధంగా ఉన్నామన్నారు. నాటో దళాలను పెంచుతూ, పశ్చిమ దేశాలే దురుసుగా ప్రవర్తిస్తున్నాయని అన్నారు. స్థానిక సమస్యలను ప్రపంచ దేశ సమస్యగా మారుస్తున్నాయని ఉక్రెయిన్, పశ్చిమ దేశాలపై ఆయన నిప్పులు కురిపించారు. వాళ్ల దూకుడుకు అడ్డుకునేందుకే సైన్యాన్ని వాడుతున్నామని పుతిన్ తెలిపారు.

''మరోసారి మీకు చెప్పదలచుకున్నాను. యుద్ధం వాళ్లు ప్రారంభించారు. దానిని అడ్డుకునేందుకు మనం సైన్యాన్ని రంగంలోకి దింపాం'' అని పుతిన్ అన్నారు. ఉక్రెయిన్ ప్రజలు వెస్ట్రన్ మాస్టర్ల చేతిలో ''బందీలు''గా మారారని, ఉక్రెయిన్ పాలకులు దేశ ప్రయోజనాలను కాపాడలేరని, విదేశీ శక్తుల ప్రయోజనాలను కాపాడేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు

Updated Date - 2023-02-21T19:53:52+05:30 IST