Japan: వేగంగా క్షీణిస్తున్న జపాన్ జనాభా.. త్వరలో అదృశ్యం
ABN , First Publish Date - 2023-03-06T21:46:50+05:30 IST
జపాన్‌లో జనాభా వేగంగా క్షీణిస్తోంది. జననాల రేటు తీవ్రంగా తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తమౌతోంది.
టోక్యో: జపాన్‌లో జనాభా (population) వేగంగా క్షీణిస్తోంది. జననాల రేటు (Birth Rate) తీవ్రంగా తగ్గిపోవడంపై ఆందోళన వ్యక్తమౌతోంది. జననాల రేటు క్షీణించడాన్ని తగ్గించకపోతే జపాన్(Japan) అదృశ్యమైపోతుందని స్వయంగా ప్రధానమంత్రి ఫుమియో కిషిడా (Prime Minister Fumio Kishida) సలహాదారు మసాకో మొరి (Masako Mori) చెప్పారు. గత నెల 28న విడుదలైన నివేదికలో జననాల రేటు గణనీయ స్థాయిలో పడిపోతుందని వెల్లడైంది. గత ఏడాది జననాల సంఖ్య కన్నా మరణాల సంఖ్య రెట్టింపుగా నమోదైంది. 2022లో 8 లక్షల జననాలు రికార్డయ్యాయి. అదే సమయంలో 15.8 లక్షల మరణాలు నమోదయ్యాయి. దేశ జనాభా కూడా పడిపోతోంది.
జపాన్ ప్రస్తుత జనాభా 12.4 కోట్లు. జననాల రేటు క్షీణించడాన్ని అడ్డుకోకపోతే సామాజిక భద్రతా వ్యవస్థ కుప్పకూలడంతో పాటు ఆర్ధిక ప్రగతి కూడా దెబ్బతింటుందని మసాకో మొరి చెబుతున్నారు. జననాల రేటు క్షీణత ఒకవైపు కలవరపెడుతుంటే మరోవైపు వృద్ధుల జనాభా మరో 29 శాతం దాకా పెరిగింది. జననాల రేటు క్షీణతకు అడ్డుకట్ట వేసేందుకు జపాన్ ప్రభుత్వం కొత్త విధానాలను అమలు చేయనుందని తెలుస్తోంది. టెక్నాలజీ పరంగానే కాకుండా శాంతియుతమైన జీవితం గడిపే దేశంగా జపాన్‌కు పేరుంది. అదే సమయంలో మూడో అతి పెద్ద ఆర్ధిక శక్తి కూడా.