India vs Canada: నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై అమెరికా ఒత్తిడి.. పబ్లిక్‌గా & ప్రైవేట్‌గా సహకరించాలంటూ..

ABN , First Publish Date - 2023-09-26T16:44:58+05:30 IST

ప్రస్తుతం భారత్, కెనడా మధ్య దౌత్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో ఇరు దేశాల మధ్య ఏర్పడ్డ చిచ్చు.. రోజురోజుకు ముదురుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే..

India vs Canada: నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై అమెరికా ఒత్తిడి.. పబ్లిక్‌గా & ప్రైవేట్‌గా సహకరించాలంటూ..

ప్రస్తుతం భారత్, కెనడా మధ్య దౌత్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో ఇరు దేశాల మధ్య ఏర్పడ్డ చిచ్చు.. రోజురోజుకు ముదురుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే.. ఈ వివాదానికి చెక్ పెట్టేందుకు గాను అగ్రరాజ్యం అమెరికా తనవంతు ప్రయత్నం చేస్తోంది. కెనడా, భారత్.. రెండూ అమెరికాకి మిత్రదేశాలు కావడం.. ఈ రెండింటితో సంబంధాలు ఎంతో ముఖ్యం కావడంతో.. ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాలను దూరం చేయాలని ట్రై చేస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా.. హర్దీప్ నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో సహకరించాలని భారత్‌ని అమెరికా కోరుతోంది.

అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ.. నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో తాము తీవ్ర ఆందోళన చెందామని అన్నారు. తమ కెనడా భాగస్వాములతో తాము టచ్‌లోనే ఉన్నామని పేర్కొన్న ఆయన.. ఈ హత్యపై కచ్ఛితమైన దర్యాప్తు జరగాలన్నారు. నేరస్తుల్ని న్యాయస్థానం ముందుకు తీసుకొచ్చి, వారికి తప్పకుండా శిక్ష పడేలా చూడాలని చెప్పారు. అయితే.. ఈ దర్యాప్తు కొనసాగడం కాస్త క్లిష్టమైనదని తాము భావిస్తున్నామని, అందుకే దర్యాప్తులో సహకారం అందించాలని భారత్‌ని ప్రైవేట్‌గా, పబ్లిక్‌గా అభ్యర్థించామని ఆయన వెల్లడించారు. భారత్ సహకారంతో ఈ దర్యాప్తు వేగంగా జరుగుతుందన్న ఆశాభావాన్ని మాథ్యూ మిల్లర్ వ్యక్తం చేశారు.


ఇదే సమయంలో.. కాలిఫోర్నియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న అమెరికా హౌస్ సభ్యుడు జిమ్ కోస్టా సైతం నిజ్జర్ హత్యకు సంబంధించిన నివేదికల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో దోషుల్ని గుర్తించేందుకు దర్యాప్తు జరపాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ‘‘కెనడియన్ సిక్కు నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ (ఇతడ్ని ఖలిస్తానీ ఉగ్రవాదిగా భారత్ ప్రకటించింది) హత్యకు గురయ్యాడనే విషయం తెలిసి నేను చాలా ఆందోళన చెందుతున్నాను. దీనిపై అధికారిక బ్రీఫింగ్ కావాలని ఒక హౌస్ ఫారిన్ అఫైర్స్ కమిటీ సభ్యునిగా నేను అభ్యర్థించాను. ఈ నేరంపై కచ్ఛితమైన దర్యాప్తు చేపట్టి, దోషుల్ని బాధ్యులుగా చేయాలి’’ అని ట్విటర్ (X ప్లాట్‌ఫామ్) మాధ్యమంగా స్పందించారు.

ఇదిలావుండగా.. భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారత్‌పై ట్రూడో ఆరోపణలు చేయడం వల్లే వివాదం చెలరేగింది. ఇరుదేశాలు పరస్పర దౌత్యాధికారుల్ని బహిష్కరించాయి. మరోవైపు.. కెనడాలోని ఖలిస్తానీ వేర్పాటువాదులు పెట్రేగిపోతున్నారు. కెనడాలోని భారత దౌత్య కార్యాలయాల ముందు ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో.. భారత్ అక్కడ బందోబస్తు పెంచారు.

Updated Date - 2023-09-26T16:44:58+05:30 IST