Washington: నిజ్జర్‌పై దర్యాప్తునకు సహకరించాలని భారత్‌ను కోరిన అమెరికా మంత్రి
ABN , First Publish Date - 2023-09-29T13:24:58+05:30 IST
ఖలిస్థానీ(Khalistan) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్యపై కెనడా చేస్తున్న దర్యాప్తునకు సహకరించాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్(Antony Blinken) భారత్ ను కోరినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.
వాషింగ్టన్: ఖలిస్థానీ(Khalistan) ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Singh Nijjar) హత్యపై కెనడా చేస్తున్న దర్యాప్తునకు సహకరించాలని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్(Antony Blinken) భారత్ ను కోరినట్లు వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్(Jai Shankar) తో గురువారం ఆంటోనీ భేటీ అయ్యారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జీ-20(G 20) సమ్మిట్ తర్వాత రెండు దేశాల మధ్య అవుతున్న అత్యున్నత స్థాయి సమావేశం ఇది. అంతకుముందు క్యూబెక్‌లో మాట్లాడిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justin Trudeau), నిజ్జర్ హత్యలో ఇండియా ప్రమేయం ఉందని ఆరోపిస్తూ, బ్లింకెన్.. జైశంకర్‌తో జరిగే సమావేశంలో ఈ సమస్యను లేవనెత్తుతారని తాను అనుకుంటున్నానని విశ్వాసం వ్యక్తం చేశారు.
అమెరికన్లు తమ వెంటే ఉన్నారని అన్నారు. ఆయన భావించినట్లుగానే ఈ అంశం చర్చకు వచ్చిందిన అమెరికా అధికారి ఒకరు తెలిపారు. అయితే వారిరువురి సమావేశం తర్వాత అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌లో నిజ్జార్ హత్య గురించి ప్రస్తావించలేదు. ఈ భేటీపై జై శంకర్ ఎక్స్(X) లో ఇలా రాసుకొచ్చారు."నా మిత్రుడు ఆంటోనీ బ్లింకెన్ తో భేటీ కావడం సంతోషంగా ఉంది. ఇరు దేశాలకు చెందిన పలు అంశాలు, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించాం" అని రాశారు. అయితే ఈ భేటీలో కెనడా అంశం చర్చకు రాలేదని పలువురు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.