Anwaar-ul-Haq: పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ ఉల్ హఖ్ ప్రమాణస్వీకారం

ABN , First Publish Date - 2023-08-14T18:57:09+05:30 IST

పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా మాజీ సెనెటర్, బలూచిస్తాన్ అవామీ పార్టీ నేత అన్వర్ ఉల్ హక్ కాకర్ సోమవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 14వ తేదీనే దేశ 8వ ఆపద్ధర్మ ప్రధానిగా కాకర్ ప్రమాణస్వీకారం చేయడం విశేషం.

Anwaar-ul-Haq: పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్ ఉల్ హఖ్ ప్రమాణస్వీకారం

ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా (Caretaker Prime Minister) మాజీ సెనెటర్, బలూచిస్తాన్ అవామీ పార్టీ (BAP) నేత అన్వర్ ఉల్ హక్ కాకర్ (Anwaar-ul-Haq Kakar) సోమవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్టు 14వ తేదీనే దేశ 8వ ఆపద్ధర్మ ప్రధానిగా కాకర్ ప్రమాణస్వీకారం చేయడం విశేషం. ఇంతవరకూ ప్రధానిగా ఉన్న షెహబాజ్‌ షరీఫ్‌ ఇటీవల ఆ దేశ జాతీయ అసెంబ్లీని రద్దు చేయడం, త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో ఆపద్ధర్మ ప్రధానిగా అన్వర్‌ ఉల్‌ హాక్‌ ప్రమాణస్వీకారం చేశారు. పాకిస్థాన్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అలీ అధికారిక నివాసంలో ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. మాజీ ప్రధాని షెహబాజ్ షరీప్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసిమ్ మునిర్, జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ జనరల్ నదీమ్ రజా తదితరులు హాజరయ్యారు.


పాకిస్థాన్‌ ఏర్పాటుకు ఆధారమైన ఇస్లామిక్‌ సిద్ధాంతాన్ని కాపాడేందుకు తాను కృషి చేస్తానని, ప్రభుత్వ అధికారికి నిర్ణయాల్లో తన స్వప్రయోజనాలకు తావు ఇవ్వనని అన్వర్ ఉల్ హఖ్ ప్రమాణం చేశారు. పార్టీలన్నీ ఏకగ్రీవంగా అన్వర్‌ ఉల్‌ హాక్‌ను ఆపద్ధర్మ ప్రధానిగా ఎన్నుకున్నామని, ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు సజావుగా జరుగుతాయని ఆశిస్తున్నామని మాజీ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అన్నారు.


కాగా, ఎన్నికల సమయం కావడంతో పాలన సజావుగా సాగేందుకు వీలుగా క్యాబినెట్‌ను ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న కాకర్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం 90 రోజుల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, నియోజవర్గాల పునర్విభజనకు మరికొంత సమయం కావాలని ఎన్నికల కమిషన్ కోరడంతో ఎన్నికలు మరికొంత జాప్యమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.

Updated Date - 2023-08-14T18:57:09+05:30 IST