Imran Khan: ఇమ్రాన్ ఖాన్ నివాసం వద్ద హైడ్రామా... !

ABN , First Publish Date - 2023-03-05T15:46:08+05:30 IST

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తోషఖానా కేసులో అరెస్టయ్యే అవకాశం ఉంది. పోలీసులు నాన్-బెయిల్‌బుల్ అరెస్టు వారెంట్‌తో...

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ నివాసం వద్ద హైడ్రామా... !

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) తోషఖానా కేసు (Toshakhana case)లో అరెస్టయ్యే అవకాశం ఉంది. పోలీసులు నాన్-బెయిల్‌బుల్ అరెస్టు వారెంట్‌తో లాహోర్‌లోని జమాన్ పార్క్‌ నివాసానికి ఆదివారంనాడు చేరుకోడవంతో పెద్దఎత్తున ఇమ్రాన్ మద్దతుదారులు, పాకిస్థాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ (PTI) కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. దీంతో ఇమ్రాన్ నివాసం వెలుపల హైడ్రామా నెలకొంది. ఇమ్రాన్ మద్దతుదారుల నినాదులు, నిరసనలతో పోలీసులు ముందుకు వెళ్లలేకపోయారని వార్తలు వచ్చాయి.

తోషఖానా కేసు విచారణకు ఇమ్రాన్ పదేపదే గైర్హాజరు అవుతుండటంతో ఆయనకు కోర్టు అరెస్టు వారెంట్లు జారీ చేసింది. లీగల్ విధివిధానాలు పూర్తి చేసి ఇమ్రాన్‌ను అరెస్టు చేస్తారని తెలుస్తోంది. కాగా, అతికష్టం మీద ఇమ్రాన్ నివాసంలోకి ఒక సీనియర్ అధికారి అడుగుపెట్టారని, అయితే అక్కడ ఇమ్రాన్ జాడ కనిపించలేదని పోలీసు వర్గాల సమాచారం. అరెస్టు నుంచి తప్పించుకునే క్రమంలోనే ఆయన తన నివాసానికి దూరంగా ఉన్నారని వారు అనుమానిస్తున్నారు.

అరెస్టు యోచన లేదు..

కాగా, ఇమ్రాన్‌ను అరెస్టు చేసే ఆలోచన ఏదీ లేదని పోలీసులు చెప్పినట్టు స్థానిక మీడియా తెలిపింది. కోర్టు ఉత్తర్వుల మేరకే తాము లాహోర్ వచ్చామని, ఆయనను తమ ప్రొటక్షన్ లోకి తీసుకునేందుకు ఇస్లామాబాద్ తరలిస్తామని ఇస్లామాబాద్ పోలీసులు ఒక ట్వీట్‌లో తెలిపారు. కోర్టు ఉత్తర్వులు అమలు కానీయకుండా అడ్డుకునే వారిపై లీగల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తీవ్ర పరిణామాలు తప్పవన్న మాజీ మంత్రి

మరోవైపు, ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకున్నా దేశ పరిస్థితి మరింత విషమిస్తుందని పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవద్ చౌదరి... షెహబాజ్ షరీప్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అసలే సంక్షోభంలో ఉన్న దేశాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టకుండా సున్నితంగా వ్యవహరించాలని అన్నారు. ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలకు ముప్పు ఉందని, ఆయనను టార్గెట్ చేసుకునే కుట్ర జరుగుతోందని పాక్ మాజీ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి మరో ప్రకటనలో పేర్కొన్నారు.

తోషఖానా కేసు ఏమిటి?

ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో దేశ విదేశాలలో సేకరించిన ఖరీదైన వస్తువులు, కానుకలను నిబంధనల ప్రకారం తోషఖానాను తరలించారు. అవే వస్తువులను తోషఖానా నుంచి తక్కువ ధరకు కొనేసి, ఎక్కువ ధరకు అమ్ముకుని ఆయన సొమ్ము చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి. దీనిపై ఎన్నికల సంఘం ఆయనపై ఐదేళ్ల పాటు అనర్హత వేటు వేసింది. దీంతో జాతీయ అసెంబ్లీకి పోటీ చేసే అవకాశాన్ని ఆయన కోల్పోయారు. తోషఖానా రిఫరెన్స్‌లో తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చినందుకు ఈసీ ఈ చర్యలు తీసుకుంది. ప్రస్తుతం తోషఖానా కేసుపై కోర్టులో విచారణ జరుగుతోంది.

Updated Date - 2023-03-05T15:56:28+05:30 IST