Earthquake: భారీ భూకంపం.. 110 మంది మృతి.. వందల మందికి గాయాలు
ABN , Publish Date - Dec 19 , 2023 | 07:54 AM
చైనాలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి సంభవించిన ఈ భూకంపంలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. వంద మందికిపైగా చనిపోగా, 200 మందికిపైగా గాయపడ్డారు.
చైనాలో భారీ భూకంపం సంభవించింది. సోమవారం అర్ధరాత్రి సంభవించిన ఈ భూకంపంలో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. వంద మందికిపైగా చనిపోగా, 200 మందికిపైగా గాయపడ్డారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 110 మంది చనిపోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయి. గాయపడిని వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వాయువ్య గన్స్, కింగ్‌హై ప్రావిన్స్‌ల్లో భూకంపం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. గన్సు ప్రావిన్స్ రాజధాని లాన్‌జౌకి నైరుతి దిశలో 100 కిలోమీటర్లు (60 మైళ్ళు) లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిసింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైంది. భూప్రకంపనలు సంభవించిన వెంటనే ఇళ్లలోని ప్రజలంతా భయంతో బయటికి పరుగులు తీశారు. అనేక భవనాలు నేలకూలాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన చైనా ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది.
భూకంపం కారణంగా గన్సు ప్రావిన్స్‌లో సుమారు 100 మంది చనిపోయారు. క్వింగ్‌హై ప్రావిన్స్‌లోని హైడాంగ్ నగరంలో 10 మంది చనిపోయారు. 100 మంది గాయపడ్డారు. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం 5.9 తీవ్రతగా నమోదైన ఈ భూకంపం హైడాంగ్ ఉన్న కింగ్‌హై సరిహద్దుకు సమీపంలోని గన్సులో సంభవించింది. ఉత్తర షాంగ్సీ ప్రావిన్స్‌లోని జియాన్‌లో దాదాపు 570 కిలోమీటర్లు (350 మైళ్ళు) దూరంలో భూకంపం 6.2 తీవ్రతతో సంభవించింది. భూకంపం కారణంగా అనేక గ్రామాల్లో విద్యుత్, నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాగా ఈ మధ్య కాలంలో చైనాలో భూకంపాలు సర్వ సాధారణమైపోయాయి. ఆగష్టులో తూర్పు చైనాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.4గా నమోదైంది. 23 మంది గాయపడగా.. డజన్ల కొద్దీ భవనాలు నేలకూలాయి. సెప్టెంబర్ 2022లో సిచువాన్ ప్రావిన్స్‌లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 6.6గా నమోదైంది. ఈ భూకంపంలో 100 మంది మరణించారు. 2008లో అయితే అతి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత ఏకంగా 7.9గా నమోదైంది. ఈ భూకంపంలో 5,335 మంది పాఠశాల విద్యార్థులతోపాటు 87,000 మందికి పైగా చనిపోయారు.