Abaya Ban: ఫ్రాన్స్‌లో బుర్ఖా వివాదం.. పాఠశాలల్లో నిషేధం.. వ్యతిరేకిస్తున్న వామపక్షవాదులు

ABN , First Publish Date - 2023-08-28T15:40:33+05:30 IST

మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థినులు బుర్ఖాలు ధరించడంపై వివాదాలు రగులుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఈ బుర్ఖా వివాదం దేశవ్యాప్తంగా...

Abaya Ban: ఫ్రాన్స్‌లో బుర్ఖా వివాదం.. పాఠశాలల్లో నిషేధం.. వ్యతిరేకిస్తున్న వామపక్షవాదులు

మన దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో విద్యార్థినులు బుర్ఖాలు ధరించడంపై వివాదాలు రగులుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఈ బుర్ఖా వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇప్పుడు ఫ్రాన్స్‌లోనూ ఇలాంటి రగడే సాగుతోంది. అక్కడి పాఠశాలల్లో ముస్లిం విద్యార్థినులు ధరించే బుర్ఖాలను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వస్త్రధారణ (బుర్ఖా) స్కూళ్లలో అనుసరించాల్సిన లౌకిక చట్టాలకు విరుద్ధంగా ఉందని.. ఆ దేశ విద్యా మంత్రి గాబ్రియేల్ అట్టల్ తెలిపారు.


వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ నిషేధాజ్ఞలను అమల్లోకి తీసుకొస్తామని.. ఈ మేరకు స్కూళ్ల ఉన్నతాధికారులకు విధివిధానాలను తెలియజేస్తామని గాబ్రియేల్ చెప్పారు. బుర్ఖాలు మతపరమైన గుర్తును కలిగి ఉన్నాయని.. దీనివల్ల ఫ్రాన్స్‌ పాఠశాల చట్టాలకు భంగం వాటిల్లుతోందని పేర్కొన్నారు. లౌకికవాదం మొదట పాఠశాలలోనే తెలుసుకోవాల్సిన విధానమని.. తరగతి గదిలోకి ప్రవేశించగానే వేషధారణతో మతం ఏంటో చెప్పేల ఉండకూడదని ఆయన తెలిపారు. ఇదే సమయంలో.. 2004 పాఠశాల చట్టం ప్రకారం స్కూళ్లలో మతపరమైన సంజ్ఞలను తెలిపే దుస్తులను ధరించకూడదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇకపై పాఠశాలల్లో విద్యార్థినులు బుర్ఖాలు ధరించకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పుకొచ్చారు.

ఇదిలావుండగా.. కొంతకాలం నుంచి పాఠశాలల్లో బుర్ఖా ధరించే సంప్రదాయం క్రమంగా పెరుగుతోంది. ఈ విషయంపై అక్కడి స్కూళ్లలో ఉద్రిక్త పరిస్తితులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బుర్ఖాలను నిషేధించాలని ఫ్రాన్స్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనల్ని ఉపాధ్యాయ సంఘాలు ఆహ్వానిస్తున్నాయి కానీ.. వామపక్షవాదులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల పౌరహక్కులకు భంగం వాటిల్లుతుందని వాదనలు వినిపిస్తున్నాయి. ముస్లిం సంఘాలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతున్నాయి. కేవలం వేషధారణ ఒక్కటే మతపరమైన గుర్తు కాదని, ఇంకా ఇతర వస్తువులు సైతం మతపరమైన గుర్తుల్ని సూచిస్తాయని ముస్లిం సంఘాలు చెప్తున్నాయి.

Updated Date - 2023-08-28T15:40:33+05:30 IST