Imran Khan Big Question: బిలావల్ భుట్టో భారత్ పర్యటనపై బుసలుకొట్టిన ఇమ్రాన్ ఖాన్..!
ABN , First Publish Date - 2023-05-07T12:51:43+05:30 IST
ఇస్లామాబాద్: పాకిస్థాన్ సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి విదేశీ పర్యటనలపై పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ నిప్పులు చెరిగారు. మీ పర్యటనల వలన కలిగిన లాభం ఏమిటి? నష్టం ఏమిటి? అని సూటి ప్రశ్నలు సంధించారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ సంక్షోభ (Pakistan Crises) పరిస్థితిని ఎదుర్కొంటున్న సమయంలో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ (Shebaz Sharif), విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి (Bilawal Bhutto Zardari) విదేశీ పర్యటనలపై పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) నిప్పులు చెరిగారు. ''మీరు విదేశీ పర్యటనల కోసం దేశ ధనాన్ని వెచ్చిస్తున్నారు. పర్యటనకు ముందు ఈ విషయమై మీరు ఎవరినైనా సంప్రదించారా? మీ పర్యటనల వలన కలిగిన లాభం ఏమిటి? నష్టం ఏమిటి?'' అని సూటి ప్రశ్నలు సంధించారు.
కింగ్ చార్లెస్-3 పట్టాభిషేక మహోత్సవానికి హాజరయ్యేందుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీప్ ప్రస్తుతం లండన్‌లో ఉన్నారు. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో గత గురువారంనాడు గోవాలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్‌సీఓ) విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు భారత్ వచ్చారు. ఈ నేపథ్యంలో షెహబాజ్, బిలావల్ భుట్లో విదేశీ పర్యటనలను ఇమ్రాన్ ఖాన్ లాహోర్‌లో జరిగిన పీటీఐ ర్యాలీలో ప్రశ్నించారు. సుప్రీంకోర్టు, రాజ్యగం, పాకిస్థాన్ ప్రధాన న్యాయమూర్తి ఉమర్ అటా బాండియల్‌కు సంఘీభావం చాటేందుకు ఈ ర్యాలీని పీటీఐ నిర్వహించింది. తన వాహనం నుంచే ఇమ్రాన్ ప్రసంగిస్తూ, పాకిస్థాన్‌ను ప్రపంచ దేశాలు చిన్నబుచ్చుతున్నాయని, ఇలాంటి సమయంలో బిలావల్ ప్రపంచ పర్యటనలు చేస్తున్నారని అన్నారు. ఈ సమయంలో తాము బిలావల్‌ను ఒకటే ప్రశ్నిస్తున్నామని, ప్రజాధనంతో పర్యటనలు చేసే ముందు ఎవరినైనా సంప్రదించారా? ఇందువల్ల మనకు కలిగి లాభనష్టాలేమిటో తెలియజేయాలని అన్నారు. ఇండియాలో పర్యటన వల్ల ఏమి సాధించరాంటూ నిలదీశారు.
ఎస్ఈఓ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రధానంగా ఉగ్రవాదంపై ప్రస్తావిస్తూ, క్రాస్-బోర్డర్ టెర్రరిజంతో సహా ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా దానిని నిలిపివేయాలని పరోక్షంగా పాకిస్థాన్‌ను ఉద్దేశించి అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చే మాధ్యమాలను బేషరతుగా నిషేధించాలని సూచించారు. సమావేశంలో పాల్గొన్న పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ సమక్షంలోనే దాయాదిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిర్మిలించాల్సిన అవసరం ఉందన్నారు.