Imran Khan : పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థపై ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-04-13T17:30:55+05:30 IST
ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా మునిగిపోతోందని, ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడం కోసం పాకిస్థాన్ (Pakistan) ఎంతో
ఇస్లామాబాద్ : ఆర్థిక వ్యవస్థ నెమ్మదిగా మునిగిపోతోందని, ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడం కోసం పాకిస్థాన్ (Pakistan) ఎంతో పోరాడవలసి ఉంటుందని ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (former Prime Minister Imran Khan) చెప్పారు. రుణాల తిరిగి చెల్లింపులకు ఎదురవుతున్న ఇబ్బందులను కూడా ఆయన ప్రస్తావించారు. రుణాలను తీసుకురావడంపై కన్నా దేశీయంగానే సంస్కరణలు తేవడానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చారు.
మాజీ ప్రధాని, పీటీఐ (Pakistan Tehreek-e-Insaf -PTI) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఓ బ్రిటిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పాకిస్థాన్ (Pakistan) ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని, దీనికి పరిష్కారం మరిన్ని అప్పులు (Loans) తేవడం ద్వారా కుదురుతుందా? లేదంటే దేశాన్ని మనం నడిపే తీరును మార్చుకోవడం ద్వారా కుదురుతుందా? అని ప్రశ్నించారు. దేశంలో ప్రభుత్వాన్ని నడిపే తీరుకు శస్త్ర చికిత్స (Surgery) జరగాలన్నారు.
ఐఎంఎఫ్ (IMF) నుంచి రుణాన్ని తీసుకునేందుకు తగిన ప్రణాళికను రూపొందించడం కోసం తాను నిపుణులతో చర్చిస్తున్నానని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. రుణాలను తిరిగి చెల్లించడానికి తగిన విధానాలను ఈ ప్రణాళికలో పొందుపరచడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అయితే దేశ (Pakistan) ఆర్థిక వ్యవస్థ ఊపిరి తీసుకోలేనంత ఉక్కిరిబిక్కిరి స్థితికి క్షీణించకూడదని చెప్పారు. రుణాలను తిరిగి చెల్లించే పరిస్థితి దిగజారకూడదన్నారు. ఎగుమతుల ద్వారా డాలర్లను సంపాదించకపోతే, రుణాలను తిరిగి చెల్లించడం ఏ విధంగా సాధ్యమవుతుందని ప్రశ్నించారు.
పాకిస్థాన్‌లో అత్యంత దయనీయమైన ఆర్థిక సంక్షోభం (Economic Crises) తాండవిస్తున్న సంగతి తెలిసిందే. రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితి దాపురిస్తుందని చాలా మంది నిపుణులు చెప్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ నుంచి దాదాపు 7 బిలియన్ డాలర్ల రుణాన్ని పొందడం కోసం పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఈ దేశంలో విదేశీ మారక ద్రవ్యం 4.2 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. ఇది కేవలం ఒక నెల దిగుమతులకు మాత్రమే సరిపోతుంది. ద్రవ్యోల్బణం మార్చిలో ఆల్ టైమ్ హై 35 శాతంగా నమోదైంది.
గత ఏడాది అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడైన సంగతి తెలిసిందే. ఆయన ప్రభుత్వ హయాంలోనే పాకిస్థాన్ (Pakistan) ఆర్థిక వ్యవస్థ ఒత్తిళ్ళకు గురైంది. ప్రస్తుత ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif)తో ఆయనకు వైరం ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఐఎంఎఫ్ సిఫారసులను అమలు చేయడంలో షరీఫ్ ప్రభుత్వం విఫలమవుతోంది.
ఇవి కూడా చదవండి :
Congress : రాహుల్ గాంధీ అపీలుపై విచారణ
Siachen Day: సియాచిన్ డే.. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన ప్రదేశంలో భారత సైన్యం ఘన విజయానికి గుర్తు..