Imran khan: తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ఖాన్ జైలు శిక్ష నిలిపివేత
ABN , First Publish Date - 2023-08-29T14:58:01+05:30 IST
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట లభించింది. తోషాఖానా కేసులో ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు మంగళవారంనాడు నిలిపివేసింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ బెయిలుపై విడుదలయ్యేందుకు మార్గం సుగగమైంది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) చీఫ్ ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట లభించింది. తోషాఖానా (Toshakhana case) కేసులో ట్రయల్ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను, రాజకీయాల్లోంచి అనర్హత వేటును ఇస్లామాబాద్ హైకోర్టు (IHC) మంగళవారంనాడు నిలిపివేసింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ బెయిలుపై విడుదలయ్యేందుకు మార్గం సుగగమైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తారిఖ్ మెహమూద్ జహంగీరి సోమవారంనాడు ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం తీర్పును మంగళవారం మధ్యాహ్నం 11 గంటలకు రిజర్వ్ చేశారు.
తోషఖానా కేసులో ఆగస్టు 5న ఇమ్రాన్ ఖాన్‌కు ట్రయిల్ కోర్టు మూడేళ్ల జైలుశిక్ష విధించింది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఇమ్రాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో వచ్చిన విలువైన బహుమతులను అమ్ముకున్నారనే కేసులో ఆయనకు కోర్టు శిక్ష విధించింది. 2018-2022లో ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన ఈ అవకతవకలకు పాల్పడ్డారంటూ ఐదేళ్ల పాటు రాజకీయాల నుంచి ఆయనపై బహిష్కరణ వేటు పడింది. ట్రయిల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించడాన్ని ఇమ్రాన్ ఖాన్ ఇటీవల హైకోర్టులో సవాలు చేశారు. వాదనలు మరింత సమయం కావాలంటూ డిఫెన్స్ టీమ్ వాదించింది. ఈ నేపథ్యంలో ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ఇమ్రాన్‌కు విధించిన జైలుశిక్షను నిలిపివేస్తూ తీర్పునిచ్చింది. ప్రస్తుతం పంజాబ్ ప్రావిన్స్‌లోని అటక్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఆయన తనకు కల్పించిన వసతులపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తన భర్తకు జైలులో ప్రాణభయం ఉందని ఇమ్రాన్ భార్య బుష్రా బీబీ ఇటీవల పంజాబ్ హోం కార్యదర్శికి లేఖ రాశారు. అటాక్ జైలు నుంచి రావల్పిండిలోని అడియాలా జైలుకు తరలించాలని కోర్టు అధికారులను కోరినప్పటికీ అమలు చేయడం లేదని ఆ లేఖలో ఆమె పేర్కొ్న్నారు.