Islamic State: తాలిబన్లను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారంటే?
ABN , First Publish Date - 2023-03-28T16:39:03+05:30 IST
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తాలిబన్ల పాలనను టార్గెట్ చేసుకున్నారు.
కాబూల్: ఆప్ఘనిస్థాన్(Afghanistan) రాజధాని కాబూల్(Kabul)లో ఆత్మాహుతి దాడికి(Suicide attack) తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ (Islamic State) ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. కాబూల్‌లో ఆప్ఘన్ విదేశాంగ కార్యాలయానికి (Afghan Foreign Minister Office) సమీపంలో సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద నిన్న భారీ పేలుడు సంభవించి ఆరుగురు పౌరులు దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. రంజాన్ పవిత్ర మాసం కావడంతో ప్రభుత్వ ఉద్యోగులు త్వరగా విధులు పూర్తి చేసుకుని బయటపడుతున్న సమయంలో, జనంతో రద్దీగా ఉండే సమయంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది.
సూసైడ్ బాంబర్ తన లక్ష్యం వైపు దూసుకువెళ్తుండగా మాలిక్ అష్ఘుర్ స్క్వేర్ వద్ద అతన్ని కాల్చిచంపామని, ఇదే సమయంలో అతను తనను తాను పేల్చేసుకున్నాడని కాబూల్ పోలీస్ ప్రతినిధి ఖలిద్ జడ్రాన్ తెలిపారు. ఈ పేలుడులో ముగ్గురు తాలిబన్ భద్రతా సిబ్బందితో సహా పలువురు గాయపడినట్టు చెప్పారు. అయితే, ఆత్మాహుతి దళ సభ్యుడి టార్గెట్ ఏమిటనేది ఆయన వెల్లడించలేకపోయారు. చెక్‌పాయింట్ సమీపంలో విదేశాంగ శాఖ కార్యాలయంతో పాటు పలు ప్రభుత్వ భవంతులు ఉన్నాయి. దీంతో విదేశాంగ కార్యాలయమే ఆత్మాహుతి బాంబర్ టార్గెట్ కావచ్చని భద్రతా సిబ్బంది అనుమానిస్తున్నారు. రెండు మృతదేహాలతో పాటు క్షతగ్రాతులను సమీపంలోని ఇటాలియన్ ఎన్జీఏ ఎమర్జెన్సీ ఆసుపత్రికి తరలించారు.
ఇటీవల కాలంలో వరుస దాడులకు తెగబడుతున్న ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లే ఈ ఆత్మాహుతి దాడికి కారణం అయ్యుంటారని తాలిబన్ సర్కార్ అనుమానించినట్లే జరిగింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు పేలుళ్లు తమ పనే అని ప్రకటించుకున్నారు. గత జనవరిలో జరిగిన పేలుడులో ఐదుగురు దుర్మరణంపాలు కాగా, అప్పుడే విధులు పూర్తి చేసుకుని బయటకు వస్తున్న విదేశాంగ కార్యాలయ సిబ్బంది పలువురు గాయపడ్డారు.
ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రస్తుతం తాలిబన్ల పాలన కొనసాగుతోంది. 2021 ఆగస్ట్‌లో ఆఫ్ఘనిస్థాన్‌నుంచి అమెరికా (United States) బలగాలు వెళ్లిపోకముందే అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ(Ashraf Ghani) విదేశాలకు పారిపోయారు. దీంతో పాక్ మద్దతుతో తాలిబన్లు నలుమూలలనుంచి కాబూల్‌ను చుట్టుముట్టారు. అప్పటికే తమ బలగాల్లో చాలామందిని అమెరికా స్వదేశానికి తరలించింది. తమ బలగాలు ఆఫ్ఘనిస్థాన్ నుంచి పూర్తిగా వెళ్లిపోయేవరకూ తమ జోలికి రావద్దని అమెరికాతో ఒప్పందం(US Taliban deal) కుదుర్చుకున్న తాలిబన్లు(Taliban) చివరకు అమెరికా బలగాల చివరి విమానం వెళ్లిపోగానే కాబూల్ సహా ఆఫ్ఘన్ అంతటినీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే షరియా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తారనే భయంతో తాలిబన్ల పాలన ప్రారంభం కాకముందే ఆఫ్ఘన్ పౌరులు ఇతర దేశాలకు పారిపోయారు. కొందరు ఆఫ్ఘనిస్థాన్ పౌరులు అమెరికా బలగాల (US military) విమానంలో కూర్చుంటే మరికొందరు బయటనుంచే రెక్కలు పట్టుకుని మరీ పారిపోయేందుకు యత్నించి కింద పడి చనిపోయారు. అమెరికా బలగాలు పోతూపోతూ తమ అత్యాధునిక ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని, సైనిక హెలికాఫ్టర్లను ఆఫ్ఘనిస్థాన్‌లోనే వదిలిపెట్టిపోవడంతో తాలిబన్లు పండగ చేసుకున్నారు.
తాలిబన్ల పాలన ఊహించినట్లే ఆఫ్ఘన్ పౌరులకు చేదు అనుభవాన్ని చూపిస్తోంది. బాలికలకు విద్య అవసరం లేదని, మహిళలు ఉద్యోగాలు చేయరాదని, మగవాళ్లు లేకుండా మహిళలు ఒంటరిగా బయటకు రావద్దని, బుర్ఖా ధరించకుండా బయటకు వస్తే చంపేస్తామని హెచ్చరికలు జారీ చేయడమే కాక అన్నంత పనీ చేశారు. మరోవైపు తాలిబన్లు భారత్‌తో(India) సత్సంబంధాలే కోరుకుంటున్నట్లు సంకేతాలు పంపుతున్నారు. గతంలో ఆఫ్ఘన్ పునర్ నిర్మాణానికి భారత్ పూర్తి స్థాయిలో సహకరించడం వల్ల భారత్‌తో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని తాలిబన్లు యత్నిస్తున్నారు. అదే సమయంలో పాకిస్థాన్(Pakistan) తమ దేశంలో జోక్యం చేసుకోవద్దని కూడా తాలిబన్లు కోరుకుంటున్నారు. పరిస్థితులు ఇలా ఉన్నా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తాలిబన్ల పాలనను టార్గెట్ చేసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌ను తమ స్వాధీనంలోకి తీసుకోవాలనే యోచన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు ఉన్నట్లు అంతర్జాతీయ పరిశీలకులు అంచనావేస్తున్నారు. ఆఫ్ఘన్ వేదికగా అంతర్జాతీయ అంశాలను ప్రభావితం చేసే యోచనలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులున్నారని చెబుతున్నారు.