Israel vs Hamas: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కొనసాగుతున్న మృత్యుఘోష.. ఇప్పటివరకు ఎంత మంది చనిపోయారంటే..?
ABN , First Publish Date - 2023-10-10T09:46:17+05:30 IST
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృత్యుఘోష కొనసాగుతోంది. ఈ యుద్ధంలో రెండు వైపుల మృతుల సంఖ్య రోజుకు రోజుకు భారీగా పెరుగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 1,600 మంది చనిపోయారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృత్యుఘోష కొనసాగుతోంది. ఈ యుద్ధంలో రెండు వైపుల మృతుల సంఖ్య రోజుకు రోజుకు భారీగా పెరుగుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 1,600 మంది చనిపోయారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం నాలుగు రోజులుగా కొనసాగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్ దాడుల్లో 143 మంది పిల్లలు, 105 మంది మహిళలు సహా 704 మంది మరణించారు. 4,000 మందికి పైగా గాయపడ్డారు. ఇక హమాస్ దాడి కారణంగా ఇజ్రాయెల్‌లో కనీసం 900 మంది మరణించారు. 2,600 మంది గాయపడ్డారు. బందీలుగా ఉన్న 100 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలు ఓ వ్యవసాయ పొలంలో లభించాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్ ఉగ్రవాద సంస్థ రహస్య స్థావరాలను ధ్వంసం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. హమాస్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడం ప్రారంభించిందని ఆయన తెలిపారు. "మేము ఈ యుద్ధాన్ని కోరుకోలేదు. ఇది అత్యంత క్రూరమైన రీతిలో మాపైకి బలవంతంగా వచ్చింది. హమాస్ ఈ యుద్ధాన్ని ప్రారంభించనప్పటికీ ఇజ్రాయెల్ దానిని పూర్తి చేస్తుంది" అని చెప్పారు.
ఒక ట్వీట్‌లో హమాస్‌ను నెతన్యాహు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్‌తో పోల్చారు. "హమాస్ ఐఎస్‌ఐఎస్‌ని ఓడించడానికి నాగరికత శక్తులన్నీ ఐక్యమైనట్లే. హమాస్‌ను ఓడించడంలో నాగరికత శక్తులు ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వాలి" అని ఆయన పేర్కొన్నారు. గాజా స్ట్రిప్‌పై "పూర్తి దిగ్బంధనం" విధిస్తున్నట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఆ ప్రాంతానికి ఆహారం, ఇంధనాన్ని అనుమతించడంపై నిషేధం కూడా ఉంది. అలాగే హమాస్ దాడుల తర్వాత ఆ ప్రాంతానికి ఇజ్రాయెల్ విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేసింది. దీంతో ప్రస్తుతం గాజాలో పూర్తిగా విద్యుత్ ఆగిపోయింది. మరోవైపు బందీల స్వేచ్ఛ కోసం ప్రతిఫలంగా మూల్యం చెల్లించడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా ఉండాలని హమాస్ ప్రతినిధి అబు ఉబైదా ఓ వీడియో ప్రసంగంలో పేర్కొన్నారు.
ఇక ఈ యుద్ధంలో అనేక దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ యుద్ధంలో యూఎస్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యునైటెడ్ కింగ్‌డమ్ ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తూ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. "హమాస్ తీవ్రవాద చర్యలకు ఎటువంటి సమర్థన, చట్టబద్ధత లేదు. విశ్వవ్యాప్తంగా వారి దుశ్చర్యలను ఖండించబడాలని మేము స్పష్టం చేస్తున్నాము. అటువంటి దురాగతాలకు వ్యతిరేకంగా తమను, తమ ప్రజలను రక్షించుకోవడానికి ఇజ్రాయెల్ చేస్తున్న ప్రయత్నాలకు మా దేశాలు మద్దతు ఇస్తున్నాయి" అని ఓ ప్రకటనలో పేర్కొన్నాయి. ఇప్పటికే ఇజ్రాయెల్‌కు యునైటెడ్ స్టేట్స్ మిలిటరీ వాయు రక్షణ, మందుగుండు సామగ్రి, ఇతర భద్రతా సహాయాలను అందజేస్తుంది. దీంతో పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ సహాయం కోసం మాస్కోను సందర్శించే అవకాశం ఉందని వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది.