Israel-Hamas war: ఇజ్రాయెల్- హమాస్ యుద్ధంలో వేల మంది మృతి.. ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారంటే..?
ABN , First Publish Date - 2023-10-11T09:33:43+05:30 IST
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. శనివారం ప్రారంభమైన ఈ యుద్ధం ఐదో రోజుకు చేరుకుంది. రెండు వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో వైమానిక దాడులు కొనసాగుతున్నాయి.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. శనివారం ప్రారంభమైన ఈ యుద్ధం ఐదో రోజుకు చేరుకుంది. రెండు వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ తమ వైమానిక దాడులను కొనసాగించడంతోపాటు గాజాలో భూదాడులను ప్రారంభించడం ద్వారా తమ దాడిని ఉధృతం చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ దేశ సైన్యం దక్షిణ ఇజ్రాయెల్‌లో తమ సభ్యులను సమీకరిస్తోంది. భారీ సైనిక సామగ్రితో పాటు రిజర్వ్ దళాలకు చెందిన మరింత మంది సభ్యులను కూడా పిలిపించారు. మొత్తంగా ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి, గాజాలో ఇజ్రాయెల్ ప్రతీకార వైమానిక దాడులతో యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. రెండు దేశాలు బాంబులు, తుపాకుల మోతతో దద్దరిల్లుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకున్నారు. ఈ యుద్ధంలో ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. అనేక భవనాలు, ఇళ్లు నేలకూలాయి. దీంతో ఇజ్రాయెల్-హమాస్‌లో మరణ మృదంగం కొనసాగుతోంది. ఈ భీకర యుద్ధంలో రెండు వైపుల మరణించిన వారి సంఖ్య ఇప్పటికే 3 వేలు దాటింది. మొత్తంగా ఇప్పటివరకు 3,300 మంది చనిపోయారు.
మరోవైపు గాజా సరిహద్దుల్లో ఉన్న దక్షిణ ఇజ్రాయెల్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. పాలస్తీనా గ్రూప్ దాడి ప్రారంభించినప్పటి నుంచి అనేక హత్యలకు పాల్పడిన హమాస్ ఉగ్రవాదుల నుంచి గాజా సరిహద్దు ప్రాంతాలను తమ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఇజ్రాయెల్ సైన్యం ఇక్కడ అనేక ప్రాంతాలు, రహదారులపై నియంత్రణను చేపట్టింది. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ రాత్రిపూట తమ ప్రతీకార వైమానిక దాడులను కొనసాగించింది. అలాగే ఇజ్రాయెల్‌లో కూడా హమాస్ ఉగ్రవాదుల కాల్పులు కొనసాగుతున్నాయి. అలాగే యునైటెడ్ స్టేట్స్ నుంచి ఆధునాతన మందుగుండు సామగ్రితో మొదటి విమానం ఇజ్రాయెల్‌లోని నెవాటిమ్ వైమానిక స్థావరంలో దిగినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ధృవీకరించింది. సైన్యం ఈ మందుగుండు సామగ్రిని గణనీయమైన దాడుల కోసం ఉపయోగించనుంది. కాగా ఈ యుద్ధంలో యూఎస్ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. అలాగే పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలనుకునేవారికి హెచ్చరిక జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన హమాస్ ఉగ్రవాదుల దాడులను "పూర్తి దుర్మార్గపు చర్య" గా పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఆయన యుద్ధంలో ఇజ్రాయెల్‌కు అవసరమైన సాయం చేస్తామని వెల్లడించారు.