King Charles Coronation: వేడుకలకే వెయ్యి కోట్ల ఖర్చు.. చార్లెస్-3 పట్టాభిషేకంలో ఇంకా హైలైట్స్ ఏంటంటే..
ABN , First Publish Date - 2023-05-06T11:27:11+05:30 IST
బ్రిటిష్ సామ్రాజ్యం(British Empire)లో నేడు (మే 6) తొలి రాజ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరగబోతోంది. బ్రిటన్ రాజుగా ఈనాటికే అధికారికంగా నియమితుడైన మూడవ ఛార్లెస్
బ్రిటిష్ సామ్రాజ్యం(British Empire)లో నేడు (మే 6) తొలి రాజ పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరగబోతోంది. బ్రిటన్ రాజుగా ఈనాటికే అధికారికంగా నియమితుడైన మూడవ ఛార్లెస్(Charles-3)కు కొన్ని వందల ఏళ్లనాటి సంప్రదాయాలను అనుసరించి కిరీటధారణ కార్యక్రమం చేయనున్నారు.
70 ఏళ్ల తర్వాత..
సుమారు 70 ఏళ్ల తర్వాత బ్రిటన్‌లో ఈ విధంగా జరుగుతున్న తొలి పట్టాభిషేకంగా ఇది రికార్డ్‌కెక్కబోతోంది. ఈ నాటి వరకు రాణులు బ్రిటన్(Britain)ను పాలించగా.. తొలిసారిగా ఒక రాజు ఇప్పుడు నాయకత్వం వహించబోతున్నాడు. క్వీన్ ఎలిజబెత్-2 మరణించిన తర్వాత ఆమె కుమారుడైన కింగ్ చార్లెస్-3 రాజుగా నేడు పట్టాభిషిక్తుడు కాబోతున్నారు. ఈరోజు పట్టాభిషేక వేడుక వైభవంగా జరుగనుంది. నేటి సాయంత్రం సరిగ్గా నాలుగున్నర గంటలకు పట్టాభిషేక కార్యక్రమం(Coronation ceremony) జరుగనుంది. బ్రిటన్‌లో 70 ఏళ్ల తర్వాత ఈ విధంగా పట్టాభిషేక మహోత్సవం వేడుకగా జరుగుతోంది. గతంలో చివరిసారిగా 1953లో ఎలిజబెత్ రాణి(Queen Elizabeth)కి ఎంతో వైభవంగా పట్టాభిషేకం జరిగింది.
అప్పటినుంచి ఈనాటి వరకూ ఇటువంటి కార్యక్రమం జరగనేలేదు. అయితే.. గతేడాది ఆమె కన్నుమూయడంతో కొత్త రాజుగా ఆమె కుమారుడు ఛార్లెస్ నియమితులయిన విషయం విదితమే. ఈ క్రమంలోనే చార్లెస్ పట్టాభిషేకాన్ని యూకే ప్రభుత్వం(UK Govt) ఘనంగా నిర్వహించబోతోంది. ఇందుకోసం పట్టాభిషేక మహోత్సవానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేపట్టింది.
పట్టాభిషేక మహోత్సవం జరగనుందిలా..
పట్టాభిషేక మహోత్సవంలో తొలుత ప్రదక్షిణ, పరిచయ కార్యక్రమం చేపడతారు. బ్రిటన్‌లోని కాంటెర్‌బరీ ఆర్చ్‌బిషప్(Archbishop of Canterbury) ముందుగా కింగ్ ఛార్లెస్‌ను ఆహ్వానితులకు పరిచయం చేస్తారు. ఆ తర్వాత కింగ్ చార్లెస్ రెండు ప్రమాణాలు చేయనున్నారు. చట్టాన్ని సమగ్రంగా కాపాడుతానని, దయతో, న్యాయంతో పరిపాలన కొనసాగిస్తానని ఛార్లెస్ ప్రమాణం చేయనున్నారు. అనంతరం చర్చి ఆఫ్ ఇంగ్లాండ్(Church of England)కు ఎంతో నమ్మకమైన ప్రొటెస్టెంట్ క్రిస్టియన్‌గా ఉంటానని ఆయన రెండో ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణాలు పూర్తికాగానే ఛార్లెస్ 1300వ సంవత్సరంలో కింగ్ ఎడ్వర్డ్(King Edward) చేయించిన రాజ సింహాసనంపై కూర్చుంటారు.
ఇది పూర్తయిన తరువాత ఆర్చ్‌బిషప్ కింగ్ ఛార్లెస్‌ను పవిత్రమైన నూనెతో అభిషిక్తుడిని చేస్తారు. నూనెతో అభిషేక కార్యక్రమం పూర్తికాగానే ఛార్లెస్‌కు బంగారుతాపడంతో(gold plating) చేసిన మహారాజ గౌనును ధరింపజేసి, ఆసనంలో కూర్చోబెడతారు. ఆ తర్వాత శిలువతో కూడిన గోళాకారంలో ఉండే బంగారు రాజముద్రను, రాజదండాన్ని ఆర్చ్‌బిషప్(Archbishop) ఆయనకు అందిస్తారు. అనంతరం ఛార్లెస్ కుడిచేతి నాలుగో వేలుకు ఉంగరం తొడిగి కిరీట ధారణ చేస్తారు. అనంతరం కింగ్ ఛార్లెస్ రాజ ఖడ్గాన్ని చేతితో పట్టుకొని సింహాసనంపై ఆసీనులవుతారు.
సింహాసనంపై ఆయన కూర్చోగానే ఆర్చ్‌బిషప్‌తోపాటు రాజకుటుంబీకులు(royal family), రక్తసంబంధీకులయిన యువరాజులు, రాజ కుటుంబ సిబ్బంది మోకాళ్లపై కూర్చొని చార్లెస్ కుడి చేతిని ప్రేమతో ముద్దాడతారు. ఈ తతంగం పూర్తి కాగానే రాణి కెమిల్లాపై పవిత్రమైన నూనె చల్లుతారు. ఈ విధమైన కిరీటధారణ(Crowning) కార్యక్రమంతో చార్లెస్ పట్టాభిషేక మహోత్సవం ముగియనుంది.
రెండు గంటల పాటు..
ఈ పట్టాభిషేక ప్రక్రియంతా సుమారు రెండు గంటలపాటు సాగే అవకాశాలున్నాయి. 70 ఏళ్ల తర్వాత జరుగుతున్నప్రిన్స్ చార్లెస్ పట్టాభిషేక సందడి ప్రపంచవ్యాప్తంగా హాట్‌టాపిక్(Hot topic)గా మారింది. మహారాజుగారి పట్టాభిషేకం అంటే రాజ్యమంతా కోలాహలం, సందడి, ఊరేగింపులు. పక్కనున్న రాజ్యాల అతిరథ మహారథులకు ఆహ్వానాలు పంపడం వంటి కార్యక్రమాలు జరగడం సహజమే.
బ్రిటన్ రాజు చార్లెస్ 3 పట్టాభిషేక వేడుకలకు(coronation ceremonies) వెయ్యి కోట్లు వెచ్చించనున్నారు. పట్టాభిషేకం సందర్భంగా దేశవ్యాప్తంగా పలు పరేడ్లు చేపట్టనున్నారు.
ఆహ్వానితుల్లో భారత ఉపరాష్ట్రపతి
ఇండియా తరపున ఉప రాష్ట్రపతి(Vice President) జగ్దీప్ ధన్‌ఖడ్ ఈ వేడుకలకు హాజరవుతున్నారు. చార్లెస్- 3 పట్టాభిషేక వేడుకలకు ఆయన కుమారుడు ప్రిన్స్ హ్యారీ తన భార్య మేఘన్ లేకుండానే హాజరుకానున్నారు. బకింగ్ హామ్ ప్యాలెస్(Buckingham Palace) వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. రాజ కుటుంబానికి చెందిన సభ్యులకు పది వరుసల వెనుక హ్యారీకి సీటు కేటాయించారు. తన కుమారుడు అర్కీ బర్త్ డే వేడుకలు ఉండడంతో కార్యక్రమం ముగిసిన వెంటనే హ్యారీ అమెరికా బయలుదేరనున్నారు.
రూ. వెయ్యి కోట్ల ఖర్చుపై వివాదం
ఇదిలావుండగా బ్రిటన్ రాజు చార్లెస్ 3 పట్టాభిషేక వేడుకలకు వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చుచేయడం వివాదాస్పదంగా మారుతోంది. ప్రస్తుతం దేశంలో ఆర్థికంగా ఇబ్బందులు(Financial difficulties) నెలకొన్న సమయంలో ఇన్ని కోట్లు ఖర్చుపెట్టి వేడుకలు నిర్వహించడం ఎందుకని పౌరులు నిలదీస్తున్నారు. తమ కష్టంతో ప్రభుత్వానికి కట్టిన పన్నుల ధనాన్ని వృథా చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది అధికారిక కార్యక్రమం కావడంతో బ్రిటన్ ప్రభుత్వమే పట్టాభిషేక ఖర్చును భరిస్తోంది. పట్టాభిషేక ఏర్పాట్లను ‘ది ఆపరేషన్ గోల్డెన్ ఆర్బ్ కమిటీ’('The Operation Golden Orb Committee') పర్యవేక్షిస్తుందని సమాచారం.
కోహినూర్ వజ్రం లేకుండానే..
రాజు చార్లెస్- 3 పట్టాభిషేకంలో ఆయన భార్య కమిల్లా కోహినూర్ వజ్రం(Kohinoor diamond) ధరించకుండానే ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కోహినూర్ వజ్రాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేయాలని ఇండియా గత కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రాజ కుటుంబం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాణి కమిల్లా కోహినూర్ ధరించి ఈ వైభవోపేతమైన వేడుకల్లో పాల్గొంటే ఇండియాతో దౌత్యపరమైన సమస్యలు(Diplomatic issues) రావొచ్చని బ్రిటన్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలోనే కోహినూర్‌కు బదులుగా క్వీన్ మేరీ కిరీటాన్ని ఆమె ధరించనున్నారు.
2200 మంది అతిథులు
చార్లెస్- 3 పట్టాభిషేక కార్యక్రమానికి 203 దేశాల నుంచి 2200 మంది అతిథులు హాజరు కానున్నారు. ఈ అతిథుల్లో వంద దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఉన్నారు. అదేవిధంగా రాజ కుటుంబానికి సేవలు అందిస్తున్న ఇండియన్ కమ్యూనిటీ వర్కర్లకూ(Indian community workers) ఆహ్వానం అందింది. ఈ విధంగా ఆహ్వానం అందుకున్న వారిలో ప్రిన్స్ ఫౌండేషన్ బిల్డింగ్ క్రాఫ్ట్ ప్రోగ్రాంలో గ్రాడ్యుయేషన్ చేసిన సౌరభ్ ఫాడ్కే కూడా ఉన్నారు.