Share News

India-Canada Row: కెనడా ఆరోపణలపై ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఆస్ట్రేలియా.. వివాదానికి కారణం లేదంటూ బాంబ్

ABN , First Publish Date - 2023-10-19T15:10:00+05:30 IST

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు.. రెండు దేశాల మధ్య తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు...

India-Canada Row: కెనడా ఆరోపణలపై ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఆస్ట్రేలియా.. వివాదానికి కారణం లేదంటూ బాంబ్

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ నిజ్జర్ హత్య విషయంలో భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు.. రెండు దేశాల మధ్య తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇలాంటి తరుణంలో ఆస్ట్రేలియా ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. భారత్‌పై ట్రూడో చేసిన ఆరోపణల్ని సమ్మతించిన ఆ దేశం.. ఆ ఆరోపణలపై వివాదం సృష్టించాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ (ASIO) డైరెక్టర్ మైక్ బర్గెస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఐదు దేశాల నిఘా సంస్థ ‘ఫైవ్ ఐస్’ ఓ చారిత్రాత్మక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా భారత్‌పై కెనడా చేసిన ఆరోపణల వ్యవహారంపై మైక్ బర్గెస్ మాట్లాడుతూ.. నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రభుత్వం ఏదైతే వాదనలు చేసిందో, దానిపై ప్రశ్నలు లేవనెత్తడానికి ఎలాంటి కారణాలు లేవని చెప్పారు. అయితే.. తమ దేశపు పౌరుడ్ని చంపిందని మరో దేశంపై ఆరోపణలు చేయడం అనేది తీవ్రమైన ఆరోపణ అని చెప్పడంలో సందేహం అన్నారు. ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని, ఇతర దేశాలు కూడా ఇలాంటివి చేయకూడదని హితవు పలికారు.


ఇదే సమయంలో.. ఆస్ట్రేలియాలో ఉంటున్న భారత ఉగ్రవాదుల్ని ఆ దేశపు ఏజెంట్లు టార్గెట్ చేస్తారా? అనే ప్రశ్న కూడా బర్గెస్‌కు ఎదురైంది. ఇందుకు ఆయన బదులిస్తూ.. అలా జరుగుతుందా? లేదా? అన్నది తాను ఊహించలేనని అన్నాడు. దీనిపై బహిరంగంగా మాట్లాడటం కూడా సముచితం కాదని పేర్కొన్నాడు. అయితే.. ఇతర దేశాల ప్రభుత్వాలు తమ దేశంలో జోక్యం చేసుకుంటున్నాయని లేదా అలాంటి ప్లాన్ చేస్తున్నాయని తమకు తెలిసినప్పుడు, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉంటామని హామీ ఇచ్చారు. మరి, ఆస్ట్రేలియన్ తీవ్రవాదులు భారత ప్రభుత్వం నుండి భయపడాల్సిన అవసరం ఉందా, లేదా? అని ప్రశ్నించినప్పుడు.. ఈ ప్రశ్నకు సమాధానం భారతదేశాన్ని అడగాలని అన్నారు. రహస్యంగా లేదా మోసపూరితంగా ప్రజలను హాని చేయడం, ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం దేశాల పని కాదని.. అలాంటిదే ఏదైనా జరిగితే ఆస్ట్రేలియా చర్యలు తీసుకుంటుందని బర్గెస్ తేల్చి చెప్పారు.

భారత్‌పై కెనడా చేసిన ఆరోపణలు ఏంటి?

జూన్ 18వ తేదీన కెనడాలోని సర్రేలో ఇద్దరు దుండగులు జరిపిన కాల్పుల్లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ మృతిచెందాడు. ఈ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని, జీ20 సమ్మిట్ జరిగిన వారం రోజుల తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన ఆరోపణలు చేశాడు. అదే టైంలో భారత దౌత్యాధికారిని కూడా కెనడా ప్రభుత్వం బహిష్కరించింది. అయితే.. భారత్ ఈ ఆరోపణల్ని తోసిపుచ్చింది. ట్రూడో ఆరోపణల్లో వాస్తవం లేదని బదులిస్తూ.. భారత్‌లోని కెనడా దౌత్యాధికారిని భారత్ నుంచి తిరిగి పంపించేసింది. అలా మొదలైన ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం.. ఇంకా ముదురుతూనే ఉంది.

Updated Date - 2023-10-19T15:10:00+05:30 IST