Pakistan: జడ్జిని బెదరించిన ఇమ్రాన్‌ఖాన్‌కు నాన్‌-బెయిలబుల్ అరెస్టు వారెంట్లు

ABN , First Publish Date - 2023-03-13T17:13:49+05:30 IST

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు నాన్-బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. ఖాతూన్‌ జడ్జి..

Pakistan: జడ్జిని బెదరించిన ఇమ్రాన్‌ఖాన్‌కు నాన్‌-బెయిలబుల్ అరెస్టు వారెంట్లు

ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు నాన్-బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయి. ఖాతూన్‌ జడ్జి జెడా చౌదరిని (Zeba Chaudhary) బెదిరించిన కేసులో డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు సివిల్ జడ్జి ఈ వారెంట్లు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం ఇమ్రాన్‌ఖాన్ సోమవారంనాడు కోర్టుకు హాజరుకావాల్సి ఉండగా, తన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఇమ్రాన్ ఖాన్ కోర్టును కోరారు. అయితే, అయన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చుతూ నాన్‌-బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసినట్టు 'జియా న్యూస్' తెలిపింది. మార్చి 29న ఇమ్రాన్‌ను తమ ముందు హాజరుపరచాలని కోర్టు ఆదేశాలిచ్చింది.

ఇమ్రాన్ ఖాన్ ఏమన్నారు?

ఇమ్రాన్ ఖాన్ గత ఏడాది జరిగిన ఒక రాజకీయ ర్యాలీలో పాల్గొంటూ, కస్టడీలో తనను చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు. జడ్జి జెబా చౌదరిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఆమెపై చర్యలు తీసుకుంటామని, అందుకు సిద్ధంగా ఉండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే ఆయనపై జడ్జిని బెదిరించారంటూ ఎఫ్ఐఆర్ నమోదైంది. పాకిస్థాన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 186, 188, 504, 506 కింద ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిపై ఇమ్రాన్ ఖాన్ ‌ఇస్లామాబాద్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. తాను లక్ష్మణరేఖ దాటి ఉండవచ్చునని, జడ్జికి క్షమాపణ చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆ అఫిడవిట్‌లో వివరణ ఇచ్చారు. ఈ కేసులోనే ఇమ్రాన్‌ సోమవారంనాడు కోర్టు ముందు హాజరు కావాల్సి ఉండగా ఆయన గైర్హాజరయ్యారు. దీనిపై కోర్టు నాన్-బెయిలబుల్ అరెస్టు వారెంట్లు జారీ చేసింది.

Updated Date - 2023-03-13T17:13:49+05:30 IST