Imran Khan: ఆర్మీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఇమ్రాన్ పేరు
ABN , First Publish Date - 2023-07-11T18:31:58+05:30 IST
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పై మరో కేసు నమోదైంది. మే 9న రావాల్పిండిలోని ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడి ఘటనకు సంబంధించి తీవ్రవాద నిరోధక చట్టం(ATC) కింద కేసు నమోదు చేశారు.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)పై మరో కేసు నమోదైంది. మే 9న రావాల్పిండిలోని ఆర్మీ జనరల్ హెడ్‌క్వార్టర్స్‌పై దాడి ఘటనకు సంబంధించి తీవ్రవాద నిరోధక చట్టం(ATC) కింద కేసు నమోదు చేశారు.
పాకిస్థాన్ తెహ్రిక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు పాక్ మిలటరీ చర్యలకు నిరసనగా "బ్లాక్ డే'' పాటిస్తూ రావిల్పిండిలోని ఆర్మీ జనరల్ హెడ్‌కార్వర్స్‌పై దాడికి దిగారు. గేట్లు పగులగొట్టారు. ఈ దాడి ఘటనతో పాటు, మెట్రో స్టేషన్‌లో నిప్పుపెట్టిన ఘటన, ఇతర ఘటనలపై సంయుక్త విచారణ బృందాలు (జేఐటీ) విచారణ చేపట్టాయి. దీనిపై మే 9న 3 కేసులు, మే 10న టెర్రరిస్టు నిరోధక చట్టం (ఏటీఏ) కింద మరో మూడు కేసులు ఇమ్రాన్‌పై నమోదు చేశారు.
అవినీతి కేసులో ఇస్లామాబాద్ హైకోర్టు ఆవరణలో నాటకీయంగా ఇమ్రాన్ అరెస్టు అనంతరం ఈ హింసాకాండ చెలరేగింది. ఖాన్‌ను నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో (ఎన్ఏబీ) అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ పీటీఐ మద్దతుదారులు ఒకప్పుడు జిన్నాహౌస్‌గా పిలిచే లాహోర్‌లోని కాప్స్ కమాండర్ హౌస్‌ను ధ్వంసం చేశారు. 20కి పైగా పౌర, మిలటరీ ఇన్‌స్టలేషన్లపై ఆందోళనకారులు జరిపిన దాడిలో 10 మందికి పైగా మృతి చెందారు. హింసాకాడం చెలరేగినప్పుడు ఎన్ఏబీ కస్టడీలో ఉన్నారు. ఖాన్ మద్దతుదారులు జరిపిన దాడులకు సంబంధించి ఫైసాబాద్‌లోని సవిల్ లైన్స్, సామనాబాద్, ఆర్ఏ బజార్, రావిల్పిండిలోని న్యూటౌన్ పోలీస్ స్టేషన్, మైన్‌వాలిలోని సిటీ పోలీస్ స్టేషన్, గుజ్రన్‌వాలాలోని పోలీస్ స్టేషన్ కంటోన్మెంట్‌లలో కేసులు నమోదయ్యాయి.
రావిల్పిండి హింసాత్మక ఘటనకు సంబంధించి 28 కేసులు నమోదు కాగా, ఒక్క కేసులోనూ ఇమ్రాన్ పేరు నమోదు కాలేదు. అయితే, విచారణలో అనుమానితులు ఇచ్చిన వాంగ్మూలం, న్యాయనిపుణుల సంప్రదింపుల అనంతరం ఇమ్రాన్‌పై కేసు నమోదు చేసినట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. కాగా, ఇమ్రాన్ ఖాన్‌ను గత ఏడాది ఏప్రిల్‌లో ప్రధాన పదవి నుంచి తొలగించినప్పటి నుంచి దేశంలో సుమారు 150 కేసులను ఆయన ఎదుర్కొంటున్నారు.