Pakistan : ఇమ్రాన్ ఖాన్‌పై హత్యాయత్నం... సంచలన విషయాలు వెలుగులోకి...
ABN , First Publish Date - 2023-03-14T18:46:21+05:30 IST
మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) గత ఏడాది నవంబరులో తనపై తానే హత్యాయత్నం చేయించుకున్నారని పాకిస్థాన్ ప్రభుత్వం
ఇస్లామాబాద్ : మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) గత ఏడాది నవంబరులో తనపై తానే హత్యాయత్నం చేయించుకున్నారని పాకిస్థాన్ ప్రభుత్వం మంగళవారం తెలిపింది. వజీరాబాద్‌లో బహిరంగ సభలో పాల్గొన్న ఖాన్‌పై గత ఏడాది నవంబరు 3న హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే.
పాకిస్థాన్ సమాచార, ప్రసార శాఖల మంత్రి మరియం ఔరంగజేబ్ (Marrium Aurangzeb) విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, వజీరా బాద్‌లో బహిరంగ సభలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతుండగా, ఆయనపై హత్యాయత్నం జరిగిందని, ఇది తనకు తానే చేయించుకున్నదని చెప్పారు. అయితే ఇందుకు సాక్ష్యాధారాలను ఆమె వెల్లడించలేదు. అవినీతి కార్యకలాపాల్లో ఖాన్ పాత్ర గురించి మాత్రమే ఆమె వివరించారు. ఖాన్ మోసాలు సాధారణమైనవి కాదన్నారు. విదేశాల నుంచి వచ్చిన బహుమతులను అక్రమంగా సొంతం చేసుకోవడం కోసం నకిలీ రశీదులు సృష్టించి, తన దొంగతనం బయటపడకుండా, కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారన్నారు. విదేశాలతో సత్సంబంధాలనే ముసుగు వేశారని మండిపడ్డారు. ఖాన్ మోసగాడన్నారు. పాకిస్థాన్ ప్రజలకు నిజం తెలియాలన్నారు.
పాకిస్థాన్‌లో రాజకీయ హత్యాయత్నాలు, హత్యలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1951లో ఆ దేశ తొలి ప్రధాన మంత్రి లియాకత్ అలీ ఖాన్ రావల్పిండిలో హత్యకు గురయ్యారు. పాకిస్థాన్ రెండో మిలిటరీ డిక్టేటర్ అయూబ్ ఖాన్ 1960, 1962లలో హత్యాయత్నాల నుంచి తప్పించుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తొలి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో 1977లో సైనిక తిరుగుబాటు వల్ల పదవీచ్యుతుడయ్యారు. ఆయన 1971, 1974లలో హత్యాయత్నాల నుంచి తప్పించుకున్నారు. మిలిటరీ డిక్టేటర్ పర్వేజ్ ముషారఫ్ 2003, 2007లలో హత్యాయత్నాల నుంచి బయటపడ్డారు. పాకిస్థాన్ తొలి మహిళా ప్రధాని బేనజీర్ భుట్టో 2007లో హత్యకు గురయ్యారు. అంతకుముందు 1993లో హత్యా యత్నం నుంచి తప్పించుకున్నారు.
ఇవి కూడా చదవండి :
Congress Vs BJP : రాహుల్ గాంధీపై అధికార పక్షం ఆగ్రహం
Same-sex marriage : స్వలింగ వివాహాలపై బయటపడిన ఆరెస్సెస్ వైఖరి