Pak National Elections: ఎన్నికల సంఘం కీలక నిర్ణయంతో ఇమ్రాన్ ఔట్..
ABN , Publish Date - Dec 30 , 2023 | 08:30 PM
పాకిస్తాన్ నేషనల్ ఎలక్షన్స్‌లో పోటీ చేయాలనుకున్న మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆశలపై ఎన్నికల సంఘం నీళ్లు చల్లింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన దాఖలు చేసిన రెండు నామినేషన్లను తిరస్కరించింది.
ఇస్లామాబాద్: పాకిస్తాన్ నేషనల్ ఎలక్షన్స్ (Pakistan National Elections)లో పోటీ చేయాలనుకున్న మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఆశలపై ఎన్నికల సంఘం (Election commission) నీళ్లు చల్లింది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన దాఖలు చేసిన నామినేషన్లను తిరస్కరించింది. రెండు నియోజకవర్గాల నుంచి ఆయన వేసిన నామినేషన్లు ఈసీ తిరస్కరించినట్టు అధికారులతో పాటు ఆయన పార్టీ మీడియా టీమ్ శనివారం తెలిపింది.
ప్రధాని పదవి నుంచి 2022 ఏప్రిల్‌లో ఇమ్రాన్ ఖాన్‌ను తొలగించినప్పటి నుంచి ఆయన పలు రాజకీయ, లీగల్ చిక్కులను ఎదుర్కొంటున్నారు. 2018 నుంచి 2022 వరకూ ప్రభుత్వ బహుమతులను చట్టవిరుద్ధంగా అమ్మేశారనే ఆరోపణలపై గత ఆగస్టులో ఆయన మూడేళ్ల జైలు పడటంతో అప్పటి నుంచి ఆయన పబ్లిక్‌లోకి రాలేదు. 2024 ఫిబ్రవరి 8వ తేదీన పాక్ జాతీయ ఎన్నికలు జరగాల్సి ఉండగా అవినీతి కేసులో పడిన శిక్ష కారణంగా ఎన్నికల్లో పోటీకి ఇమ్రాన్‌పై అనర్హత వేటు పడిందని, అయినప్పటికీ ఆయన శుక్రవారంనాడు నామినేషన్లు వేశారని ఆయన పార్టీ మీడియా టీమ్ తెలిపింది. లాహోర్ నుంచి ఇమ్రాన్ నామినేషన్ వేయగా, ఆయనను కోర్టు దోషిగా ప్రకటించినందున ఆ నియోజకవర్గం రిజస్టర్ ఓటరు కాదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. మైన్‌వాలి నుంచి ఇమ్రాన్ వేసిన మరో నామినేషన్‌ను కూడా ఈసీ తిరస్కరించింది. ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించడాన్ని సస్పెండ్ చేయాలని ఇమ్రాన్ ఖాన్ విజ్ఞప్తిని హైకోర్టు గత వారంలో కొట్టివేసింది. కాగా, ఇమ్రాన్‌తో పాటు పీటీఐకి చెందిన సీనియర్ నేత, పార్టీ వైస్ చైర్మన్ షా మెహమూద్ ఖురేషి సహా పలువురు నేతల నామినేషన్లను కూడా ఈసీ తోసిపుచ్చింది.
నవాజ్ షరీఫ్‌కు గ్రీన్‌సిగ్నల్
మరోవైపు, 2024 ఎన్నికల్లో పోటీకి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ రెండు నియోజకవర్గాల నుంచి దాఖలు చేసిన నామినేషన్లకు ఎన్నికల సంఘం ఆమోదించింది.