Pakistan: పాక్‌లో ఏం జరుగుతోంది?

ABN , First Publish Date - 2023-03-15T17:42:02+05:30 IST

కార్యకర్తల రాళ్ల దాడుల్లో అనేకమంది పోలీసులు గాయపడ్డారు. ఇమ్రాన్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Pakistan: పాక్‌లో ఏం జరుగుతోంది?
Toshkhana Imran Khan

లాహోర్: తోష్‌ఖానా (Toshkhana) కేసులో పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)కు ప్రస్తుతానికి ఊరట లభించింది. గురువారం ఉదయం పది గంటల వరకూ ఆయన్ను అరెస్ట్ చేయరాదని లాహోర్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు వెనక్కు తగ్గారు.

వాస్తవానికి ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసేందుకు లాహోర్‌లోని ఆయన నివాసానికి పోలీసు బలగాలు పెద్ద ఎత్తున చేరుకున్నాయి. నిన్నటి నుంచీ ఇమ్రాన్ మద్దతుదారులకు, పోలీస్ బలగాలకు మధ్య ఘర్షణ జరిగింది. పీటీఐ(Pakistan Tehreek e Insaf) కార్యకర్తల రాళ్ల దాడుల్లో అనేకమంది పోలీసులు గాయపడ్డారు. ఇమ్రాన్ నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇమ్రాన్‌ను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారనే వదంతులు వ్యాపించడంతో దేశంలోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనల్లో అనేకమంది పీటీఐ కార్యకర్తలు గాయపడ్డారు.

ఇమ్రాన్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పోలీసుల హింసాకాండను ఎండగట్టారు. తన నివాసం వద్ద జరుగుతున్న తతంగాన్నీ బయటపెట్టారు. తనపై లండన్‌లో ఉన్న పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుట్ర చేస్తున్నారని ఇమ్రాన్ ఆరోపించారు.

ఇమ్రాన్‌పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో దాదాపు 80 కేసులు ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ గత ఏడాది ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ, మహిళా మేజిస్ట్రేట్‌ను బెదిరించారనే ఆరోపణలపై నమోదైన కేసులో జారీ అయిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్‌ను ఇస్లామాబాద్ కోర్టు (Islamabad Court) మంగళవారం సస్పెండ్ చేసింది. అయితే తోష్‌ఖానా అవినీతి కేసులో జారీ అయిన అరెస్ట్ వారంట్లు అమల్లో ఉన్నాయి.

తోష్‌ఖానా అంటే ఖజానా అని అర్థం. ఇది పాకిస్థాన్ ప్రభుత్వ శాఖ (Pakistan government department). కేబినెట్ డివిజన్ పర్యవేక్షణలో ఇది పని చేస్తోంది. పాకిస్థాన్ నేతలు, అధికారులకు వచ్చే బహుమతులను దీనిలో ఉంచుతారు. బహుమతి విలువ రూ.30,000 కన్నా తక్కువగా ఉంటే, పాకిస్థాన్ అధ్యక్షుడు లేదా ప్రధాన మంత్రి దానిని తన వద్ద ఉంచుకోవచ్చు. ఇంత కన్నా ఎక్కువ ఖరీదైన బహుమతులను తోష్‌ఖానాలో ఉంచాలి. ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రిగా పని చేసిన కాలంలో ఖరీదైన బహుమతులను తోష్‌ఖానాకు అప్పగించలేదని ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసులో ఇమ్రాన్‌ను ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో ఆయన నివాసం వద్దకు పీటీఐ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.

తీవ్ర ఆర్ధిక, ఆహార సంక్షోభం ఎదుర్కొంటోన్న పాకిస్థాన్‌లో హింసాత్మక ఘటనలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని సామాన్యులు హడలిపోయే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు.

Updated Date - 2023-03-15T18:24:21+05:30 IST