India vs Canada: భారత్-కెనడా వివాదం.. అమెరికా సంచలన నిర్ణయం.. భలే ట్విస్ట్ ఇచ్చిందే!
ABN , First Publish Date - 2023-09-24T15:18:11+05:30 IST
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై చేసిన ఆరోపణలు.. ఇరు దేశాల మధ్య దౌత్య వివాదానికి దారి తీశాయి. రోజురోజుకూ ఈ వివాదం..
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్‌పై చేసిన ఆరోపణలు.. ఇరు దేశాల మధ్య దౌత్య వివాదానికి దారి తీశాయి. రోజురోజుకూ ఈ వివాదం ముదురుతూనే ఉంది. ఈ నేపథ్యంలో.. ప్రపంచ దేశాలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. రెండు దేశాలతో సంబంధాలు తమకు ముఖ్యం కావడంతో.. ఒక్కరికే సంపూర్ణ మద్దతు తెలపలేకపోతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా సైతం అదే పని చేస్తోంది. తమ మద్దతు భారతదేశానికేనని చెప్తున్నప్పటికీ.. ఈ వివాదంలో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదు. ఇప్పుడు ఈ అంశంపై.. రాజకీయ వ్యూహ సంస్థ సిగ్నమ్ గ్లోబల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు చార్లెస్ మైయర్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్, కెనడా మధ్య నెలకొన్న దౌత్య వివాదానికి బిడెన్ ప్రభుత్వం వీలైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తుందని చార్లెస్ మైయర్స్ తెలిపారు. ప్రధాని మోదీ హయాంలో భారత్‌తో బలమైన సంబంధాలను నిర్మించుకోవడంలో అమెరికా ఎంతో పురోగతి సాధించిందని.. దానికి అంతరాయం కలిగించకూడదని బైడెన్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన పేర్కొన్నారు. దీనికితోడు.. చైనా ఆగడాలను అరికట్టేందుకు భారత్‌తో కలిసి అమెరికా లోతైన సంబంధాల్ని కొనసాగిస్తోందని పేర్కొన్నారు. కాబట్టి.. కెనడా, భారత్ వివాదంలో అమెరికా జోక్యం చేసుకోదని తాను అనుకుంటున్నానని చార్లెస్ వివరించారు. భారత్‌పై ట్రూడో చేసిన ఆరోపణలు ఎంతో తీవ్రమైనవని.. అందుకు అతని వద్ద సరైన సాక్ష్యాలు, ఇంటెలిజెన్స్ వివరాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. కాగా.. ఎన్నికల సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు నిధులు సమకూర్చడంలో చార్లెస్ మైయర్స్ కీలక పాత్ర పోషించారు.
మరోవైపు.. హర్దీప్ సింగ్ హత్య కేసు దర్యాప్తులో కెనడాకు సహకరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ శుక్రవారం భారత్‌ను కోరారు. దర్యాప్తు సజావుగా కొనసాగడం, వాస్తవాలు వెలుగులోకి రావడం ముఖ్యమన్న ఆయన.. తాము జవాబుదారీతనాన్ని కోరుకుంటున్నామన్నారు. అటు.. పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ సైతం ఈ వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్, కెనడా రెండూ తమకు మిత్రదేశాలేనని.. ఒకవేళ ఈ రెండింటిలో ఎంపిక చేసుకోవాల్సి వస్తే మాత్రం అమెరికా మొగ్గు భారత్‌వైపేనని తేల్చి చెప్పారు. ఎందుకంటే.. హర్దీప్ ఒక ఉగ్రవాది అని, భారత్‌తో అమెరికా సంబంధాలు ఎంతో ముఖ్యమని చెప్పుకొచ్చారు.