Pakistan : భారత్‌లో కలపాలంటూ పీఓకేలో నిరసనలు

ABN , First Publish Date - 2023-01-11T16:26:34+05:30 IST

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని గిల్గిట్-బాల్టిస్థాన్‌లో ఆ దేశంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Pakistan : భారత్‌లో కలపాలంటూ పీఓకేలో నిరసనలు
Protests in Gilgit Baltistan

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని గిల్గిట్-బాల్టిస్థాన్‌లో ఆ దేశంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాకిస్థాన్ ప్రభుత్వ విధానాలు తమ పట్ల వివక్షాపూరితంగా ఉన్నాయని ఈ ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వీడియోలనుబట్టి ప్రభుత్వంపై వీరి ఆగ్రహం ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

లడఖ్‌లో భారత దేశంతో తమను తిరిగి కలిపేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నట్లు ఓ వీడియోలో కనిపించింది. కార్గిల్ రోడ్డును తెరచి, భారత దేశంలోని లడఖ్‌లో ఉన్న తమ తోటి బాల్టిస్‌లతో తమను కలపాలని డిమాండ్ చేస్తున్నట్లు కనిపించింది. ఈ ప్రాంతంలో గత కొద్ది నెలల నుంచి నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. లోడ్ షెడ్డింగ్, చట్టవిరుద్ధ భూ ఆక్రమణలు, సహజ వనరుల దోపిడీ వంటి అంశాలపై వీరు పోరాడుతున్నారు.

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరు మాజీ ప్రధాన మంత్రి రజ ఫరూఖ్ హైదర్ కూడా నిరసన గళం వినిపించారు. అవామీ యాక్షన్ కమిటీ పూంఛ్ జిల్లాలోని హజీరా సబ్‌డివిజన్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, భద్రతా దళాలు ఈ ప్రాంతంలో భూ కబ్జాలకు పాల్పడుతున్నాయని, ఈ దారుణానికి తెర దించాలని డిమాండ్ చేశారు. స్థానికుల హక్కులకు రక్షణ కల్పించాలని కోరారు. ఖల్సా భూమి నుంచి గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రజలను ఖాళీ చేయించవద్దని కోరారు. డోగ్రా పాలన కాలం నుంచి వీరు ఇక్కడ జీవిస్తున్నారని చెప్పారు.

Updated Date - 2023-01-11T16:37:08+05:30 IST