Imran Khan arrest: పాక్‌లో అస్థిరత ప్రభావం భారత్‌‌పై పడే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక

ABN , First Publish Date - 2023-05-09T21:30:28+05:30 IST

పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan) అరెస్ట్‌తో ఆ దేశంలో అలజడి రేగింది.

Imran Khan arrest: పాక్‌లో అస్థిరత ప్రభావం భారత్‌‌పై పడే అవకాశం.. అప్రమత్తంగా ఉండాలని నిపుణుల హెచ్చరిక
Pakistan can affect India as well

న్యూఢిల్లీ: పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ (Imran Khan) అరెస్ట్‌తో ఆ దేశంలో అలజడి రేగింది. ఇస్లామాబాద్ ఆవరణలో అరెస్ట్ సమయంలో ఇమ్రాన్‌కు గాయాలయ్యాయంటూ ప్రచారం జరగడం, ఇమ్రాన్‌ మెడ పట్టి తోసుకుంటూ తీసుకెళ్తున్న దృశ్యాలు చూసి ఆయన అభిమానులు రెచ్చిపోతున్నారు. రావల్పిండిలోని పాక్ సైనిక ప్రధాన కార్యాలయంపై దాడులు చేశారు. అనేక మంది సైనిక అధికారుల ఇళ్లపై దాడులు చేస్తున్నారు. దేశంలోని పలు చోట్ల విధ్వంసానికి దిగారు. దీంతో దేశవ్యాప్తంగా అలజడి నెలకొంది. అల్లరిమూకలను అదుపు చేసేందుకు జరిపిన కాల్పుల్లో ఒకరు మరణించారు. అనేకమంది గాయపడ్డారు.

ఈ తరుణంలో పాకిస్థాన్‌లో నెలకొన్న అస్థిరత కారణంగా భారత్‌కు (India) కూడా ఇబ్బందేనని, పాక్ అస్థిరత ప్రభావం భారత్‌పై పడే అవకాశముందని విదేశీ వ్యవహారాల నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ అప్రమత్తంగా ఉండాలని రిటైర్ట్ మేజర్ జనరల్ పీకే సెహగల్ (Major General PK Sehgal) హెచ్చరించారు.

అంతకు ముందు అల్ కాదీర్ ట్రస్ట్ అవినీతి కేసులో ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇమ్రాన్ అరెస్ట్ సమయంలో కోర్టులో ఘర్షణ జరిగింది. దీంతో ఇమ్రాన్ లాయర్లకు గాయాలయ్యాయి. ఇమ్రాన్‌ను పాక్ రేంజర్లు రహస్యప్రాంతానికి తరలించారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్ - నవాజ్ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తనపై కుట్ర చేస్తోందని ఇమ్రాన్ ఆరోపిస్తున్నారు. ఎలాగైనా తనను కేసుల్లో ఇరికించాలని, హత్య చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని అరెస్ట్‌కు ముందు ఇమ్రాన్ వీడియో సందేశం సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇమ్రాన్‌పై 85కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కొన్ని కేసుల్లో ఇప్పటికే బెయిల్ రాగా మరికొన్ని కేసుల విచారణ కొనసాగుతోంది. పాకిస్థాన్ ముస్లిం లీగ్ - నవాజ్ పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ఖాతరు చేయడం లేదని ఇమ్రాన్ ఇటీవలే ఆరోపించారు.

ఇమ్రాన్‌ను అరెస్ట్ చేసిన తీరుపై పాక్ సుప్రీంకోర్ట్ తీవ్ర అభ్యంతర వ్యక్తం చేసినట్లు సమాచారం.

పాక్‌లో ఇప్పటికే తీవ్ర ఆహార, ఆర్ధిక సంక్షోభం నెలకొంది. తాజాగా ఇమ్రాన్ అరెస్ట్‌తో శాంతి భద్రతల సమస్య కూడా తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Updated Date - 2023-05-09T21:30:31+05:30 IST