Share News

Vladislav Kanyus: ప్రియురాలిని 111 సార్లు పొడిచి చంపిన కిరాతకుడు.. శిక్షించకుండానే వదిలేసిన పుతిన్.. ఎందుకో తెలుసా?

ABN , First Publish Date - 2023-11-11T15:30:31+05:30 IST

Russia: మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తేనే పురుషుల్ని కఠినంగా శిక్షిస్తారు. మరోసారి మహిళల జోలికి వెళ్లినివ్వకుండా తగిన బుద్ధి చెప్తారు. అలాంటిది.. అత్యాచారానికి ఒడిగట్టి, 111 సార్లు పొడిచి తన ప్రియురాల్ని చంపిన వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలి?

Vladislav Kanyus: ప్రియురాలిని 111 సార్లు పొడిచి చంపిన కిరాతకుడు.. శిక్షించకుండానే వదిలేసిన పుతిన్.. ఎందుకో తెలుసా?

మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తేనే పురుషుల్ని కఠినంగా శిక్షిస్తారు. మరోసారి మహిళల జోలికి వెళ్లినివ్వకుండా తగిన బుద్ధి చెప్తారు. అలాంటిది.. అత్యాచారానికి ఒడిగట్టి, 111 సార్లు పొడిచి తన ప్రియురాల్ని చంపిన వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలి? జీవిత ఖైదుగా కఠిన కారాగార శిక్షనో, మరణశిక్ష విధించడమో జరుగుతుంది. కానీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం అందుకు భిన్నంగా నిందితుడ్ని వదిలేశాడు. అయితే.. ఇందుకు ఓ బలమైన కారణం ఉంది. తాను ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనాలని ఆ దోషి నిర్ణయించుకోవడంతో.. ఆ హంతకుడ్ని పుతిన్ వదిలేయడం జరిగింది.

ఆ హంతకుడి పేరు వ్లాదిస్లావ్ కాన్యుస్. అతడు వెరా పెఖ్తెలేవా అనే యువతిని ప్రేమించాడు. మొదట్లో వీరి ప్రేమాయణం సాఫీగానే సాగింది కానీ, ఆ తర్వాత వెరా అతడ్ని దూరం పెడుతూ వచ్చింది. చివరికి బ్రేకప్ చెప్పి వెళ్లిపోయింది. దీంతో ప్రియురాలిపై పగ పెంచుకున్న అతడు, చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఒక రోజు తనకు వెరా ఒంటరిగా దొరకడంతో.. అదే సరైన సమయమని భావించి ఆమెపై దాడి చేశాడు. తొలుత ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మూడు గంటల పాటు ఆమెను చిత్రహింసలకు గురి చేశాడు. అనంతరం 111 సార్లు కత్తితో పొడిచి, అత్యంత దారుణంగా ఆమెను హతమార్చాడు. ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల వారు పోలీసులకు ఏడుసార్లు ఫోన్ చేశారు. కానీ.. వారి నుంచి స్పందన రాలేదు. చివరకు వెరా తల్లి ఒక్సానా సమాచారం అందించడంతో.. పోలీసులు రంగంలోకి దిగి, కాన్యుస్‌ని అదుపులోకి తీసుకున్నారు. అతనికి 17 సంవత్సరాల కఠిన శిక్ష విధించారు.


ఇప్పుడు తాను ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో పాల్గొంటానని కాన్యుస్ చెప్పడంతో.. ఇంకా ఏడాది శిక్ష మిగిలి ఉండగానే పుతిన్ అతడ్ని క్షమించి, యుద్ధానికి పంపించారు. ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న దక్షిణ రష్యాలోని రోస్టోవ్‌కు కాన్యుస్‌ను బదిలీ చేసినట్లు జైలు అధికారులు తెలిపారు. అయితే.. అతడు జైలు నుంచి విడుదలయ్యాడన్న సంగతి తెలిసి ఒక్సానా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘ఈ విషయం తెలియగానే నేను షాక్‌కి గురయ్యా. నా కూతురు అక్కడ సమాధిలో కుళ్లిపోతుంటే, హంతకుడేమో యుద్ధం పేరుతో బయట హాయిగా తిరుగుతున్నాడు. నేనిప్పుడు జీవితం మీదే నమ్మకం కోల్పోయాను’’ అని ఆవేదన వ్యక్తం చేసింది. తనకిప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదని పేర్కొంది. ఒక క్రూరమైన వ్యక్తి చేతికి ఆయుధం ఎలా ఇస్తారని, ప్రతీకారంతో అతడు తమని చంపినా చంపొచ్చని, అసలు అతడు మనిషే కాదని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

మరోవైపు.. జైలు నుంచి ఇలా హంతకుల్ని యుద్ధానికి పంపడాన్ని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ సమర్థించారు. ఉక్రెయిన్‌లో పోరాడటానికి పంపిన రష్యన్ ఖైదీలు.. తాము చేసిన నేరాలకు ‘రక్తంతో’ ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ‘‘ఘోరమైన నేరాలతో దోషులుగా తేలిన వారు.. యుద్ధభూమిలో తమ నేరాలకు రక్తంతో ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు’’ అని పెస్కోవ్ విలేకరులతో అన్నారు. కాగా.. ఏప్రిల్ 27న ప్రెసిడెంట్ డిక్రీ ద్వారా కాన్యుస్‌ని క్షమించి, రణరంగంలోకి పంపించారు. ఒక్సాన తన ఆవేదన వ్యక్తం చేయడంతో.. కాన్యుస్‌ను ఎక్కడ బదిలీ చేశారన్న విషయంపై సరైన సమాచారం ఇవ్వాలని మహిళా హక్కుల కార్యకర్త అలియోనా పోపోవా డిమాండ్ చేశారు.

Updated Date - 2023-11-11T15:30:32+05:30 IST