Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ దంపతుల కాన్వాయ్‌లో భద్రతా లోపం.. కాన్వాయ్ వెళ్తుండగా ఒక్కసారిగా...
ABN , Publish Date - Dec 18 , 2023 | 12:04 PM
అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ దంపతులు ప్రయాణిస్తున్న వాహన కాన్వాయ్‌లో భద్రతా లోపం బయటపడింది. బిడెన్ దంపతులు ఆదివారం డెలావేర్‌లోని క్యాంపెయిన్ కార్యాలయం నుంచి బయలుదేరి వెళ్తుండగా కాన్వాయ్‌లోని ఒక వాహనాన్ని ఓ కారు వచ్చి ఢీకొట్టింది.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ దంపతులు ప్రయాణిస్తున్న వాహన కాన్వాయ్‌లో భద్రతా లోపం బయటపడింది. బిడెన్ దంపతులు ఆదివారం వాషింగ్టన్‌లోని డెలావేర్‌లో ఉన్న ఎన్నికల క్యాంపెయిన్ కార్యాలయం నుంచి బయలుదేరి వెళ్తుండగా కాన్వాయ్‌లోని ఒక భద్రతా వాహనాన్ని ఓ కారు వచ్చి ఢీకొట్టింది. దీంతో ఒక్క క్షణంపాటు గందరగోళం నెలకొంది. భద్రతా అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆదివారం రాత్రి 8:07 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. వాషింగ్టన్‌లోని బిడెన్-హ్యారీస్ 2024 ప్రచార కార్యాలయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది.
ప్రెసిడెంట్ కాన్వాయ్‌కి రక్షణ కవచంగా ఉండే ఎస్‌యూవీ వాహనాన్ని సెడాన్ కారు వచ్చి ఢీకొట్టింది. క్యాంపెయిన్ కార్యాలయం ఎదురుగా ఉండే రోడ్డు కూడలి వద్ద ఈ ఘటన జరిగింది. దీంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ తక్షణమే అప్రమత్తమయ్యారు. వెంటనే బిడెన్ దంపతులు ఉన్న వాహనానికి రక్షణ కవచం ఏర్పరచారు. అంతేకాదు ప్రమాదానికి కారును సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ ఆయుధాలతో చుట్టుముట్టారు. కారులోని వ్యక్తికి తుపాకీలు గురిపెట్టారు. దీంతో అతడు చేతులు పైకెత్తారని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. మొత్తానికి బిడెన్, ప్రథమ మహిళ జిల్ బిడెన్‌ల దంపతులను అక్కడి నుంచి హుటాహుటిన విల్మింగ్టన్‌లోని వారి నివాసానికి జాగ్రత్తగా చేర్చినట్టు భద్రతా అధికారులు తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన కార్యక్రమంలో దంపతులు పాల్గొన్నారు. అక్కడే ఆహారం తిన్న తర్వాత బయలుదేరారని వివరించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి ఉందని తెలుస్తోంది.