UNSC: కశ్మీర్‌పై పాక్ పాతపాట..స్పందించడం దండగేనన్న భారత్
ABN , First Publish Date - 2023-03-08T16:04:48+05:30 IST
దాయాది దేశం మరోసారి సందర్భ శుద్ధి లేకుండా అంతర్జాతీయ వేదకపై కశ్మీర్ ప్రస్తావన లేవనెత్తింది. భంగపాటుకు..
న్యూయార్క్: దాయాది దేశం పాకిస్తాన్ (Pakistan) మరోసారి సందర్భ శుద్ధి లేకుండా అంతర్జాతీయ వేదికపై కశ్మీర్ ప్రస్తావన లేవనెత్తి భంగపాటుకు గురైంది. భారత్ చేతిలో చీవాట్లు తింది. మహిళలు, శాంతి, భద్రత అనే అంశంపై భద్రతా మండలిలో చర్చ సందర్భంగా కశ్మీర్ (Kashmir) అంశాన్ని పాక్ లేవనెత్తింది. దీనిపై పాక్‌ను భారత్ దుయ్యబట్టింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో జరిగిన చర్చలో పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారి (Bilawal Bhutto Zardari) పాల్గొంటూ..కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీనికి ఐరాస భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ (Ruchira kamboj) ఘాటుగా స్పందించారు. ''ప్రపంచవ్యాప్తంగా మహిళలకు భద్రత, శాంతియుత పరిస్థితులు అనే అంశంపై మనం ఈరోజు చర్చ జరుపుతున్నాం. చర్చను మేము గౌరవిస్తున్నారు. అయితే దీనిపై చర్చించడానికి బదులుగా పాక్ ప్రతినిధులు పనికిమాలిన, నిరాధార, రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. ఇలాటి దుష్ర్పచారాలపై మేము స్పందించడం కూడా దండగే'' అని కాంబోజ్ ఘాటుగా విమర్శించారు.
కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదకలపై ప్రస్తావించడం, భారత్ ప్రతిఘటన చవిచూడటం ఇది మొదటిసారి కూడా కాదు. జమ్మూకశ్మీర్, లద్దాఖ్ భారత్‌లో అంతర్భాగమని, ఎప్పటికీ భారత్‌లోనే ఉంటాయని, వాటిపై ఎవరి జోక్యం అవసరం లేదని భారత్ పలుమార్లు దాయాది దేశానికి తేల్చిచెప్పింది. పొరుగుదేశమైన పాకిస్థాన్‌తో సాధారణ సంబంధాలను తాము కోరుకుంటున్నామని, ఇందుకు శత్రుత్వం, బీభత్సం లేని వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ఇస్లామాబాద్‌పైనే ఉందని స్పష్టం చేసింది. పుల్వామా దాడికి ప్రతిగా 2019 ఫిబ్రవరిలో పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లోనే జైషే ఉగ్రవాదుల శిబిరాలపై భారత యుద్ధవిమానాలు విరుచుకుపడినప్పటి నుంచి భారత్-పాక్ దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణను భారత ప్రభుత్వం 2019 ఆగస్టులో ఎత్తివేయడంతో ఇరుదేశాల సంబంధాలు మరింత దిగజారాయి.