America:హిరోషిమా-నాగసాకిపై వేసిన దాని కంటే పవర్‌ఫుల్ అణుబాంబు తయారు చేస్తున్నట్లు ప్రకటించిన అమెరికా
ABN , First Publish Date - 2023-11-01T15:19:02+05:30 IST
రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా-నాగసాకి(Hiroshima- Nagasaki)లపై వేసిన న్యూక్లియర్ బాంబ్(Nuclear Bomb) కంటే 24 రెట్లు ప్రభావవంతమైన అణు బాంబు తయారు చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
జెరూసలెం: రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా-నాగసాకి(Hiroshima- Nagasaki)లపై వేసిన న్యూక్లియర్ బాంబ్(Nuclear Bomb) కంటే 24 రెట్లు ప్రభావవంతమైన అణు బాంబు తయారు చేస్తున్నామని అమెరికా తెలిపింది. జపాన్ పై అప్పటి యుద్ధంలో అమెరికా ప్రయోగించిన అణుబాంబు ఎంతటి విధ్వంసాన్ని సృష్టించిందో విదితమే. ఆ ఘటనని జపాన్(Japan) ఇప్పటికీ మర్చిపోలేదు. తాజాగా అమెరికా ఆ యుద్ధంలో వేసిన బాంబుతో పోలిస్తే 24 రెట్లు శక్తిమంతమైన అణుబాంబు తయారు చేస్తామనడం ఇప్పుడు ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది.
హిరోషిమాపై వేసిన అణుబాంబు 15 కిలో టన్నుల శక్తి, నాగసాకిపై వేసిన బాంబు 23 కిలో టన్నుల శక్తిని విడుదల చేశాయి. ఇప్పుడు అమెరికా చేయనున్న అణుబాంబు 360 కిలో టన్నుల శక్తిని వెలువరిస్తుందని చెబుతున్నారు. 2030నాటికల్లా అమెరికా అణ్వాయుధ సామర్థ్యాన్ని వెయ్యికి పెంచనున్నట్లు అమెరికా రక్షణ శాఖ తెలిపింది. ఇజ్రాయెల్ - హమాస్(Israeil-Hamas) యుద్ధం నేపథ్యంలో తమ దేశ రక్షణ సామర్థ్యాన్ని బలపరుచుకోవాలనే పనిలో అమెరికా ఉన్నట్లు తెలుస్తోంది. టెల్ అవీవ్‌లో ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న సంఘర్షణపై చర్చించేందుకు US అధ్యక్షుడు జో బిడెన్ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు తో సమావేశమయ్యారు. జాతీయ అణ్వస్త్ర భద్రతా యంత్రాంగం B61-1 అనే సూపర్ పవర్‌ఫుల్ అణుబాంబును తయారు చేస్తుందని తెలిపింది. దేశ భద్రత డిమాండ్ దృష్ట్యా ఈ బాంబు తయారు చేస్తున్నట్టు చెప్పింది. దీని తయారీకి 692 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.