Vivek Ramaswamy: 75% ఉద్యోగాలను తొలగించడంతో పాటు ఎఫ్‌బీఐని మూసివేస్తా.. వివేక్ రామస్వామి సంచలన ప్రతిపాదనలు
ABN , First Publish Date - 2023-09-14T18:29:58+05:30 IST
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఎలాంటి హామీలు చేస్తారో అందరికీ తెలుసు. వాటిని అమలు చేయడం దాదాపు సాధ్యం కాదని తెలిసినా సరే.. ఓటర్లను ఆకర్షించడం కోసం పెద్ద పెద్ద హామీలే చేస్తారు..
ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు ఎలాంటి హామీలు చేస్తారో అందరికీ తెలుసు. వాటిని అమలు చేయడం దాదాపు సాధ్యం కాదని తెలిసినా సరే.. ఓటర్లను ఆకర్షించడం కోసం పెద్ద పెద్ద హామీలే చేస్తారు. మాటలు కోటలు దాటేలా భారీ డైలాగులు కొడతారు. ఇప్పుడు అమెరికాలో ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రధాని అభ్యర్థి కోసం పోటీ పడుతున్న వివేక్ రామస్వామి కూడా అలాంటి డైలాగులే కొడుతున్నాడు. తాను 2024 ఎన్నికల్లో గెలిచి, వైట్‌హౌస్‌లో అడుగుపెడితే.. మొట్టమొదటగా తాను కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తున్న 75 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తానని కుండబద్దలు కొట్టారు. అంతేకాదు.. ఎఫ్‌బీఐ వంటి సంస్థలను సైతం మూసివేస్తానంటూ బాంబ్ పేల్చారు.
అమెరికాలోని వాషింగ్టన్‌లో ఒక ప్రముఖ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివేక్ రామస్వామి మాట్లాడుతూ.. తాను వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన తొలిరోజు నుంచే పని మొదలుపెడతానని, ఎఫ్‌బీఐ సహా ఐదు ఫెడరల్ సంస్థల్ని మూసివేస్తానని, తన ప్రతిపాదనల్లో విద్యాశాఖను మూసివేయడం కూడా ఉందని చెప్పారు. అంతేకాదు.. బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్థాలు, న్యూక్లియర్ రెగ్యులేటరీ కమీషన్, ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్, కామర్స్ డిపార్టుమెంట్స్, ఫుడ్ & న్యూట్రిషన్ సర్వీస్‌ని తొలగించాలని అనుకుంటున్నానని తెలిపారు. ఏడాది చివరినాటికి 50శాతం మంది ఉద్యోగులను తొలగించాలని భావిస్తున్నామన్నారు. వచ్చే నాలుగేళ్లలో.. ప్రస్తుతం ఉన్న 22లక్షల మంది ఉద్యోగుల్లో నుంచి 75 శాతం మందిని తొలగించడమే తమ లక్ష్యమన్నారు.
ఎఫ్‌బీఐలో అనవసరమైన పాత్రల్లో ఉన్న 20 వేల మందిని తొలగించి.. 15వేల మందిని వివిధ సమాఖ్య విభాగాలకు కేటాయించాలని తన ప్రతిపాదల్లో భాగమని రామస్వామి చెప్పారు. బ్యూరోక్రసీ చేయకూడని పనులను తరచుగా చేపడుతోందని, ఇందులోని కార్మికులు తమ విధుల్ని సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నారని నొక్కివక్కాణించారు. ఇక విదేశాంగా విధానం విషయంలో.. చైనా బుట్టలో రష్యా పడకుండా, ఆ దేశంతో అమెరికా ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా.. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఇప్పటికే ఉన్న నియంత్రణ రేఖలను అలాగే ఉంచేస్తానని.. ఉక్రెయిన్ నాటోలో చేరకుండా చూస్తానని అని ఇదివరకే తెలిపారు.
ఇదిలావుండగా.. అధ్యక్ష అభ్యర్థి పోటీల్లో భాగంగా రామస్వామి ముందంజలో దూసుకుపోతున్నారు. తన ప్రతిపాదనలతో ఆయన అనేక మంది మద్దతుని చూరగొంటున్న తరుణంలో.. ఆయనకే ఎక్కువ మద్దతు లభిస్తోంది. ఇటీవల నిర్వహించిన పోల్‌లో 504 మంది తమ స్పందన తెలియజేగా.. 28% మంది రామస్వామిని ఉత్తమంగా పేర్కొన్నారు. అతని తర్వాతి స్థానాల్లో ఫ్లోరిడా గవర్నర్ డీసాంటిస్ (27శాతం), మాజీ ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్(13శాతం), భారత సంతతి వ్యక్తి నిక్కీ హేలీ (7శాతం) వరుసగా ఉన్నారు.