Vladimir Putin: ఆ విషయంలో మోదీ కరెక్ట్ అంటూ.. ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించిన వ్లాదిమిర్ పుతిన్

ABN , First Publish Date - 2023-09-13T16:47:45+05:30 IST

వ్లాదివోస్తోక్‌లోని ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌ ప్లీనరీ సెషన్ జరగ్గా.. ఇందుకు పుతిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు రష్యా తయారీ కార్ల గురించి మీడియా నుంచి ప్రశ్నలు...

Vladimir Putin: ఆ విషయంలో మోదీ కరెక్ట్ అంటూ.. ప్రధానిపై ప్రశంసల వర్షం కురిపించిన వ్లాదిమిర్ పుతిన్

భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు పరిష్కారాల మార్గాలపై ఒకరినొకరు సూచించుకోవడం, పరస్పర సహకారాలు అందించుకోవడం, ఒకరిపై మరొకరు పొగడ్తలు కురిపించుకోవడం.. వంటి తరచూ చేస్తుంటారు. ఇప్పుడు పుతిన్ మరోసారి ప్రధాని మోదీ విధానాలపై ప్రశంసల వర్షం కురిపించారు. దేశీయ ఉత్పత్తుల్ని ప్రోత్సాహించడంలో భాగంగా.. మోదీ చేపట్టిన మేక్-ఇన్-ఇండియా విధానం ఎంతో గొప్పదని మెచ్చుకున్నారు. భారతదేశంలో తయారైన ఉత్పత్తులను ఉపయోగించమని భారతీయులను ప్రోత్సాహించడంతో పాటు మేక్-ఇన్-ఇండియా కార్యక్రమాన్ని ప్రమోట్ చేస్తూ.. మోదీ సరైన పని చేస్తున్నారని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల దేశీయ పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయని, తాము కూడా దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రోత్సాహించేందుకు భారత్ విధానాలనే అనుసరిస్తామని అన్నారు.


వ్లాదివోస్తోక్‌లోని ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌ ప్లీనరీ సెషన్ జరగ్గా.. ఇందుకు పుతిన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు రష్యా తయారీ కార్ల గురించి మీడియా నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నలకు పుతిన్ సమాధానం ఇస్తూ.. ‘‘ఒకప్పుడు మన దగ్గర దేశీయంగా తయారు చేసిన కార్లు ఉండేవి కావు. కానీ.. ఇప్పుడు మనమే సొంతంగా కార్లను తయారు చేసుకుంటున్నాం. అవును.. 1990లో మనం భారీస్థాయిలో కొనుగోలు చేసిన మెర్సిడీస్, ఆడి కార్లతో పోల్చుకుంటే.. దేశీయ కార్లు సాదాసీదాగా ఉన్నాయి. కానీ.. అది ఏమాత్రం సమస్య కాదు. నాకు తెలిసినంతవరకు.. భారత్ లాంటి భాగస్వామ్య దేశాల నుంచి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంది. భారతదేశం.. స్వదేశీ తయారీ, వినియోగంపై దృష్టి పెట్టింది. ఈ విషయంలో ప్రధాని మోదీ కరెక్ట్. మేడ్-ఇన్-ఇండియా బ్రాండ్‌లను వినియోగించమని ప్రజల్ని ప్రోత్సాహించడం ద్వారా ప్రధాని మోదీ సరైన పని చేస్తున్నారు. రష్యాలోనూ దేశీయంగా తయారుచేసిన కార్లు ఉన్నాయి కాబట్టి.. వాటిని మనం ఉపయోగించాలి’’ అని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో.. ఇటీవల ఢిల్లీ వేదికగా భారత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోదీ ఆవిష్కరించిన కారిడార్ ప్రణాళికలపై కూడా పుతిన్ స్పందించారు. ‘‘ఇండియా - మిడిల్ ఈస్ట్ - యూరప్ ఎకనామిక్ కారిడార్’ ఏ విధంగానూ రష్యాను ప్రభావితం చేయదని.. నిజానికి ఇది తమ దేశానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. చివరి నిమిషంలో అమెరికన్లు ఇందులో జత అయ్యారని, అయితే వారికి ఈ ప్రాజెక్ట్‌లో (వ్యాపారం పరంగా) పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని చెప్పారు.

Updated Date - 2023-09-13T16:47:45+05:30 IST