పుతిన్ చావు సొంతవాళ్ల చేతుల్లోనే...జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-02-27T16:26:14+05:30 IST
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ఏదో ఒక రోజు తన ఆంతరింగికుల చేతుల్లోనే..
కీవ్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladmir Putin)పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ (Zelensky) సంచలన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ ఏదో ఒక రోజు తన ఆంతరింగికుల చేతుల్లోనే హతమవుతారని జెలెన్స్కీ పేర్కొన్నారు. 'ఇయర్' అనే శీర్షికతో వచ్చిన ఉక్రెయిన్ డాక్యుమెంటరీలో జెలన్స్కీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు 'న్యూస్ వీక్' ఒక కథనాన్ని ప్రచురించింది. ఉక్రెయిన్పై రష్యా దాడికి ఏడాది అయిన సందర్భంలో ఈ డాక్యుమెంటరీ విడుదలైంది. రష్యా అధ్యక్షుడి (putin) నాయకత్వంలో ఏదో ఒక దశలో అసంతృప్తి మొదలవుతుందని, ఆయన సన్నిహితులే ఆయనకు వ్యతిరేకంగా చర్య తీసుకునేందుకు ప్రేరేపితులవుతారని ఈ డాక్యుమెంటరీలో జెలెన్స్కీ అన్నారు.
''కచ్చితంగా పుతిన్ నాయకత్వంపై అంతర్గతంగా అసంతృప్తులు మొదలవుతాయి. ఆ నియంతను ఆయన అనుచరులే చంపేస్తారు. అందుకు కారణాలేమిటి? ఎప్పుడు జరుగుతుంది? ఎలా జరుగుతుంది? అనేవి మాత్రం నాకు తెలియదు'' అని జెలెన్స్కీ పేర్కొన్నట్టు న్యూస్ వీక్ తెలిపింది. పుతిన్ అంతరంగిక వర్గాల్లో అసంతృప్తులు మొదలయ్యాయని, వాషింగ్టన్ పోస్ట్ ఇటీవల వార్తలు ప్రచురించిన క్రమంలో నితిన్స్కీ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రష్యా అధ్యక్షుడి సన్నిహిత మిత్రుల్లో అసంతృప్తులు క్రమంగా పెరుగుతున్నాయని వాషింగ్టన్ పోస్ట్ ఆ కథనంలో పేర్కొంది. యుద్ధానికి ముగింపుగా క్రిమియన్ ద్వీపకల్పం ఉక్రెయిన్ నియంత్రణలోకి వస్తుందని జెలెన్స్కీ ఆదివారంనాడు చెప్పారు. ''ఇది మన నేల, మన ప్రజ, మన చరిత్ర. ఉక్రెయిన్లోని ప్రతి మూలకు మన జెండాను తిరిగి అందిస్తాం'' అని అన్నారు. కాగా, అంతరంగికుల చేతుల్లోనే పుతిన్ హతమవుతారంటూ జెలెన్స్కీ తాజా వ్యాఖ్యలపై రష్యా ఇంకా స్పందించాల్సి ఉంది.