Share News

Vladimir Putin: నా స్నేహితుడికి విజయం దక్కాలని ఆశిస్తున్నా.. లోక్‌సభ ఎన్నికలపై వ్లాదిమిర్ పుతిన్

ABN , Publish Date - Dec 28 , 2023 | 03:53 PM

2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తన స్నేహితుడైన భారత ప్రధాని నరేంద్ర మోదీకి విజయం దక్కాలని ఆశిస్తున్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ..

Vladimir Putin: నా స్నేహితుడికి విజయం దక్కాలని ఆశిస్తున్నా.. లోక్‌సభ ఎన్నికలపై వ్లాదిమిర్ పుతిన్

Vladimir Putin On PM Modi: 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తన స్నేహితుడైన భారత ప్రధాని నరేంద్ర మోదీకి విజయం దక్కాలని ఆశిస్తున్నానని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. న్యూ ఢిల్లీ, మాస్కో మధ్య సాంప్రదాయ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని నొక్కి చెప్పారు. అంతేకాదు.. ప్రధాని మోదీ రష్యాలో పర్యటించాలని తాను కోరుకుంటున్నానని, ఆయన్ను కలుసుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో భేటీ సందర్భంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో రష్యాలో పర్యటించాల్సిందిగా ప్రధాని మోదీకి ఆహ్వానం పంపారు.

‘‘వచ్చే ఏడాదిలో భారత్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో.. భారత్‌లో ‘బిజీ పొలిటికల్ షెడ్యూల్’ ఉంటుంది. అయితే.. నా మిత్రుడైన మోదీ ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఏదేమైనా.. రాజకీయ శఖ్తులు ఎలా ఉన్నా.. మన రెండు దేశాల మధ్య సాంప్రదాయ స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతాయని నేను ఆశిస్తున్నాను’’ అని పుతిన్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు గందరగోళంగా ఉన్నప్పటికీ.. ఆసియాలో తమ మిత్రదేశమైన భారత్‌తో సంబంధాలు క్రమంగా పురోగమిస్తున్నాయని, ఇది తనకు సంతోషాన్ని కలిగిస్తోందని పేర్కొన్నారు. తన ప్రియతమ స్నేహితుడు మోదీ రష్యాలో పర్యటించాలని తాను ఆకాంక్షిస్తున్నానని, ఆయన రష్యాకు వస్తే తనకెంతో ఆనందంగా ఉంటుందని అన్నారు. రష్యా పర్యటనకు మోదీ వస్తే.. సంబంధిత, ప్రస్తుత సమస్యలపై చర్చించగలమని అన్నారు. అలాగే.. రష్యా, భారత్ మధ్య సంబంధాలపై కూడా మాట్లాడుకోగలమని చెప్పుకొచ్చారు.


ఇదే సమయంలో.. ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధం అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఉక్రెయిన్‌లో జరుగుతున్న పరిణామాలపై తాను ప్రధాని మోదీతో చాలాసార్లు చర్చించానని, ఈ సమస్యని శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించేందుకు ఆయన సాయశక్తులా కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తనకు తెలుసని పుతిన్ చెప్పారు. ఈ విషయంపై భారత్‌తో చర్చలు కొనసాగుతాయని కూడా అన్నారు. మరోవైపు.. మనం ప్రపంచంతో బలమైన సంబంధాల్ని ఏర్పరుచుకోవాలని మంత్రి జైశంకర్ అన్నారు. మనకు ప్రయోజనం చేకూరే అవకాశం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కు తగ్గకూడదన్నారు. భారత్‌కి ప్రయోజనం చేకూర్చే ఛాన్స్ వచ్చినప్పుడు ఒక స్టాండ్ తప్పకుండా తీసుకోండని ప్రధాని మోదీ చెప్పారని.. అదే తాము చేస్తున్నామని వెల్లడించారు.

ఇదిలావుండగా.. రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదం మొదలైనప్పటి నుంచి ఈ సమస్యని చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్ సూచిస్తూ వస్తోంది. ఈ అంశంపై ప్రధాని మోదీ ఇప్పటికే పుతిన్‌తోనూ, అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీతోనూ ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఏడాది ప్రారంభంలో ఉక్రెయిన్ అధ్యక్షుడితో సమావేశం జరిగినప్పుడు.. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి భారత్ చేయగలిగినదంతా చేస్తుందని నొక్కి చెప్పారు. అంతకుముందు 2021లో సమర్‌కండ్‌లో పుతిన్‌తో జరిగిన సమావేశంలో.. ఇది యుద్ధం యుగం కాదని, చర్చల ద్వారా ఈ సమస్యని పరిష్కరించాలని మోదీ పేర్కొన్నారు.

Updated Date - Dec 28 , 2023 | 03:53 PM