Manipur Violence: మణిపూర్‌లోని బీజేపీ ప్రభుత్వానికి కొత్త సమస్య.. ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ ఎమ్మెల్యేల తిరుగుబాటు
ABN , First Publish Date - 2023-11-04T20:46:10+05:30 IST
ఈ ఏడాది మే నెలలో 3వ తేదీన మణిపూర్‌లో చెలరేగిన అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రిజర్వేషన్ల విషయంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత.. పెద్ద వివాదంగా మారింది. కుల హింస మంటల్లో ఆ రాష్ట్రం...
ఈ ఏడాది మే నెలలో 3వ తేదీన మణిపూర్‌లో చెలరేగిన అల్లర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రిజర్వేషన్ల విషయంలో రెండు వర్గాల మధ్య నెలకొన్న ఉద్రిక్తత.. పెద్ద వివాదంగా మారింది. కుల హింస మంటల్లో ఆ రాష్ట్రం తగలబడిపోతోంది. ఈ వివాదమే ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారితే.. ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలో పడేసే మరో కొత్త సమస్య వచ్చిపడింది. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ ప్రభుత్వంలోని కుకీ వర్గానికి చెందిన 10 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. బీరెన్ సింగ్ నాయకత్వాన్ని ముక్తకంఠంతో ఖండించిన వాళ్లు.. పార్టీకి శ్రేణికి దూరంగా ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు.
నవంబర్ 2వ తేదీన కాంగ్‌పోక్పి జిల్లాకు చెందిన యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్ (UPF), కుకి నేషనల్ ఆర్గనైజేషన్ (KNO) అనే రెండు కుకీ సంస్థలు.. శాంతి చర్చల కోసం మధ్యవర్తులుగా కేంద్రం పంపిన ఎకె మిశ్రా, హోం మంత్రిత్వ శాఖ అధికారులను కలిశాయి. రాష్ట్రంలోని కుకీ ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో ప్రత్యేక పరిపాలన ఉండాలని ఆ రెండు సంస్థలు కోరాయి. ఆ తర్వాత నవంబర్ 3వ తేదీన 10 మంది కుకీ నేతల సంతకంతో కూడిన ప్రకటన వెలువడింది. వీరిలో ఇద్దరు మంత్రులు, ఇద్దరు కుకీ పీపుల్స్ అలయన్స్, ఒక స్వతంత్ర ఎమ్మెల్యే సహా ఏడుగురు బీజేపీకి చెందిన వారున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం తమకు ప్రత్యేక అడ్మినిస్ట్రేషన్ (రాష్ట్రం) ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ‘‘మణిపూర్ రాష్ట్రం మమ్మల్ని (కుకీలు) రక్షించడంలో ఘోరంగా విఫలమైంది. కాబట్టి మేము భారత రాజ్యాంగం ప్రకారం యూనియన్ ఆఫ్ ఇండియా నుండి ప్రత్యేక అడ్మినిస్ట్రేషన్ డిమాండ్ చేస్తున్నాం. మేము ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాం’’ అని ఒక ప్రకటనలో వాళ్లు పేర్కొన్నారు.
ఇదిలావుండగా.. రాష్ట్ర పోలీసు కమాండోల సెర్చ్ ఆపరేషన్, అన్‌ప్రొఫెషనల్ ప్రవర్తన కారణంగా తెంగ్నౌపాల్ జిల్లా పరిధిలోని మోరేలో ఉన్న తమ గ్రామాలను విడిచి వందల మంది పురుషులు, మహిళలు, పిల్లలు భయంతో వెళ్లిపోయారని అనేక గిరిజన సంస్థలు, పది మంది గిరిజన ఎమ్మెల్యేలు ఆరోపించారు. ఈ విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెంటనే జోక్యం చేసుకొని.. మోరే, ఇతర కుకీ-జోమి-హ్మార్ గిరిజన నివాస ప్రాంతాలలో మోహరించిన మణిపూర్ పోలీసు కమాండోలందరినీ ఉపసంహరించుకోవాలని.. వారి స్థానంలో తటస్థ కేంద్ర బలగాలను నియమించాలని కోరారు. చాలా మంది మహిళలపై కమాండోలు కనికరం లేకుండా దాడి చేసి వేధించారని.. వారు స్థానిక ఆసుపత్రిల్లో చేర్చబడ్డారని కూడా పేర్కొన్నారు.