Siddaramaiah: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణం చేయనున్న నేపథ్యంలో ఆశ్చర్యం కలిగించే 4 నిజాలు ఇవే..
ABN , First Publish Date - 2023-05-18T22:02:16+05:30 IST
20న కన్నడ నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధారామయ్య సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్యకు సంబంధించిన 4 వాస్తవాలు
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly election) కాంగ్రెస్ (Congress) జయభేరి తర్వాత సీఎం అభ్యర్థిత్వంపై దాదాపు 4 రోజులపాటు కొనసాగిన ఉత్కంఠకు గురువారం తెరపడింది. డిప్యూటీ సీఎంగా కొనసాగేందుకు కేపీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ అంగీకరించడంతో సీఎం పీఠం పంచాయితీ తేలిపోయింది. అధిష్ఠానం అండతో అనుభవజ్ఞుడు, కాంగ్రెస్ సీనియర్ అయిన సిద్ధరామయ్యకు సీఎం పదవి దక్కింది. 20న కన్నడ నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధారామయ్య సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్యకు సంబంధించిన 4 వాస్తవాలను చూద్దాం..
1. సిద్ధరామయ్య ప్రస్తుత వయసు 75 సంవత్సరాలు. కర్ణాటకలో ఐదేళ్లపాటు సంపూర్ణ కాలం సీఎంగా పనిచేసి మళ్లీ రెండో సీఎంగా అవకాశం దక్కించుకున్న రెండవ వ్యక్తి సిద్ధరామయ్యనే. ఆయన కంటే ముందు డీ దేవరాజ్ ఉర్స్ (1972-1980) రెండో దఫా సీఎంగా ఎంపికైన మొదటి వ్యక్తిగా నిలిచారు. అయితే రెండో విడతలో రెండేళ్లపాటు మాత్రమే పదవిలో కొనసాగారు. కాగా మొదటి దఫా ప్రభుత్వంలో ఇందిరా గాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీ కాలం కూడా ఉంది.
2. కర్ణాటక సీఎంగా ఐదేళ్ల పూర్తికాలం పనిచేసి.. అనంతరం ఎన్నికల్లో ఓడిపోయి మళ్లీ ముఖ్యమంత్రిగా అవకాశం దక్కించుకున్న మొదటి వ్యక్తి సిద్ధరామయ్యే. దేవరాజ్ ఉర్స్ రెండోసారి సీఎంగా అవకాశం దక్కించుకున్నప్పటికీ అధికారంలో ఉన్నప్పుడే రెండోసారి అవకాశం దక్కింది. కాగా అధికారంలో ఉండగానే రెండో దఫా అధికారంలోకి వచ్చిన చివరి సీఎంగా రామకృష్ణ హెగ్దే ఉన్నారు. అయితే మధ్యంతర ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది.
3. సీఎంగా త్వరలోనే ప్రమాణస్వీకారం చేయనున్న సిద్ధరామయ్య సంపూర్ణంగా ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగితే కొత్త చరిత్ర సృష్టిస్తారు. సీఎంగా 2 సార్లు సంపూర్ణంగా పదవిలో కొనసాగిన వ్యక్తిగా రికార్డ్ సృష్టిస్తారు. కాగా మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యడియూరప్ప సీఎంగా 4 సార్లు ప్రమాణస్వీకారం చేసినా ఒక్కసారి కూడా పూర్తికాలం పనిచేయలేదు.
4. 2006లో సిద్ధరామయ్య జనతాదళ్ (సెక్యులర్) నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఐదేళ్లపాటు సీఎం పదవిలో ఉన్న ఏకైక కాంగ్రెస్ వలస నాయకుడు సిద్ధరామయ్య.