EWS quota : ఆర్థిక బలహీన వర్గాలకు రిజర్వేషన్లు.. ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ..
ABN , First Publish Date - 2023-05-05T16:30:21+05:30 IST
ఆర్థిక బలహీన వర్గాలకు చెందినవారికి ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ : ఆర్థిక బలహీన వర్గాలకు చెందినవారికి ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరపబోతోంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (CJI DY Chandrachud) నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నెల 9న విచారణ జరుపుతుంది. 103వ రాజ్యాంగ సవరణ చెల్లుబాటును సమర్థిస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పును రివ్యూ పిటిషన్‌లో సవాల్ చేశారు.
ఆర్థిక బలహీన వర్గాలకు చెందినవారికి ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 103వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఇది చెల్లుతుందని గత ఏడాది నవంబరులో 3:2 మెజారిటీతో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఐదుగురు న్యాయమూర్తుల్లో ముగ్గురు ఈడబ్ల్యూఎస్ కోటాకు అనుకూలంగా తీర్పు చెప్పారు. ఈ ధర్మాసనంలో అప్పటి సీజేఐ జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ బేల ఎం త్రివేది, జస్టిస్ జేబీ పర్దీవాలా ఉన్నారు.
జస్టిస్ దినేశ్ మహేశ్వరి ఇచ్చిన తీర్పులో, రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని ఈ రాజ్యాంగ సవరణ ఉల్లంఘిస్తోందా? ఈడబ్ల్యూఎస్ కోటా నుంచి వెనుకబడిన తరగతులకు మినహాయింపు ఇవ్వడం వల్ల సమానత్వ సిద్ధాంతం, మౌలిక నిర్మాణం ఉల్లంఘనకు గురవుతున్నాయా? అనే అంశాలు ఉన్నట్లు తెలిపారు. అనంతరం ఈ రాజ్యాంగ సవరణ సమానత్వ సిద్ధాంతం, మౌలిక నిర్మాణాలను ఉల్లంఘించలేదని చెప్పారు.
ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాల్లో ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం 2019లో నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలు, సాంఘికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు కల్పిస్తున్న రిజర్వేషన్ల పరిధిలోకి రానివారికి ఈ నూతన రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఇవి కూడా చదవండి :
Tipu Sultan : కేరళలో రాడికల్ జీహాదిజమ్ విత్తనాలు నాటినవాడు టిప్పు సుల్తాన్
Manipur Violence : మణిపూర్ హింసాకాండ వెనుక అసలు వాస్తవాలు