Rajasthan CM race: రాజస్థాన్ సీఎం రేసులో 7 మంది.. వారి విశేషాలివే..
ABN , First Publish Date - 2023-12-04T13:49:06+05:30 IST
రాజస్థాన్ సీఎం రేసులో బీజేపీ నుంచి చాలా మంది ఆశావహులున్నారు. అయితే బీజేపీ అగ్రనాయకత్వం ఎవరి వైపు మొగ్గుతుందనేది ఆసక్తికరంగా మారింది.
జైపుర్: దేశంలోని 5 రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 3 చోట్ల విజయదుందుభి మోగించింది. ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లలో అధికార కాంగ్రెస్(Congress)ని మట్టికరిపించి బీజేపీ(BJP) జెండా పాతింది. మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని తిరిగి సుస్థిరపరుచుకుంది. అయితే రాజస్థాన్ సీఎం రేసులో బీజేపీ నుంచి చాలా మంది ఆశావహులున్నారు. బీజేపీ అగ్రనాయకత్వం ఎవరి వైపు మొగ్గుతుందనేది ఆసక్తికరంగా మారింది. రాజస్థాన్ సీఎం రేసులో ఉన్న ఏడుగురి విశేషాలను తెలుసుకుందాం..
1.వసుంధరా రాజే
బీజేపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన విజయ్ రాజే సింధియా కుమార్తె అయిన వసుంధరా రాజే (Vasundhara Raje) రాజస్థాన్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా సేవలందించారు. 1984లో బీజేపీలో చేరిన వసుంధర ధోల్‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ముఖ్యమంత్రి స్థానానికి చేరుకున్నారు. ఆమె ఇప్పటివరకు మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా గెలుపొందారు. అలాగే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లు బీజేపీని విజయ తీరాలకు చేర్చారు. ఆమెకు రాజస్థాన్ అంతటా మంచి ఫాలోయింగ్ ఉన్న లీడర్ గా ఎదిగారు.
2.బాబా బాలక్‌నాథ్
యోగి ఆఫ్ రాజస్థాన్‌గా పేరు తెచ్చుకున్న బాబా బాలక్‌నాథ్ (Baba Balaknath) కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. తిజారా అసెంబ్లీ స్థానం నుంచి బాలక్‌నాథ్ బరిలోకి దిగి గెలుపొందారు. 40 ఏళ్ల బాలక్‌నాథ్ 1984లో బెహ్రోడ్‌లోని ఓ గ్రామంలో యాదవ కుటుంబంలో జన్మించారు. రోహ్‌తక్‌లోని మస్త్‌నాథ్ మఠానికి బాలక్‌నాథ్ ఎనిమిదో మహంత్. బాలక్‌నాథ్ తరఫున యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారంలో పాల్గొన్నారు.
3.దియా కుమారి
జైపుర్ రాజకుటుంబానికి చెందిన దియా కుమారి (Diya Kumari) కూడా ముఖ్యమంత్రి ఆశావహుల జాబితాలో ఉన్నారు. 2013లో బీజేపీలో చేరినప్పటి నుంచి దియా వరుసగా మూడోసారి గెలుపొందారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న సవాయ్ మాధోపూర్ నియోజకవర్గంలో ఆమె అనేక అభివృద్ధి పనులు చేపట్టి మంచి పేరు తెచ్చుకున్నారు. 2019లో ఆమె ఏకంగా 5 లక్షల పైచిలుకు మెజారిటీతో ఎంపీగా గెలుపొందారు. వీరు మాత్రమే కాకుండా గజేంద్ర సింగ్ షెకావత్, కిరోరీ మాల్ మీనా, సీపీ జోషీ కూడా ముఖ్యమంత్ర పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు.
4. గజేంద్ర సింగ్ షెకావత్
కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్(Gajendra Singh Shekhawat) బీజేపీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమైన వ్యక్తి. పార్టీలోని అసమ్మతిరాగాల స్వరాలను తగ్గించడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. వారందరినీ ఒకతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. సంజీవని క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ స్కామ్‌పై మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ని ఇరకాటంలో పెట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ గహ్లోత్‌ను ఓడించడం ద్వారా షెకావత్ తన రాజకీయ పునాదులు బలపరుచుకున్నారు. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో సీఎం రేసులో 3వ స్థానంలో నిలిచారు.
5.అర్జున్ రామ్ మేఘవాల్
తన ట్రేడ్‌మార్క్ ఆకుపచ్చ, నారింజ రంగు తలపాగాతో కనిపించే అర్జున్ రామ్ మేఘవాల్(Arjun Ram Meghwal) సీఎం రేసులో ఉన్నారు. ఆయన ముక్కుసూటి మనిషి. అందరితో కలుపుగోలుగా ఉంటారు. ప్రభుత్వానికి సంబంధించిన కీలక బిల్లుల ఆమోదం విషయంలో ప్రతిపక్షాలను సైతం ఒప్పించి మెప్పించగల నేతగా పేరుతెచ్చుకున్నారు.
6. కిరోడి లాల్ మీనా
మీనా సామాజికవర్గాన్ని గెలిపించాలనే లక్ష్యంతో రాజస్థాన్‌లో బీజేపీ కురువృద్ధుడు కిరోడి లాల్ మీనా(Kirodi Lal Meena)ను బరిలోకి దింపారు. తూర్పు రాజస్థాన్‌లో పార్టీ పనితీరు మెరుగుపడటంతో ఆయనా సీఎం రేసులోకి వచ్చారు. 72 ఏళ్ల వయస్సు ఉన్నా పట్టుదలతో పని చేసే వ్యక్తిగా పేరుతెచ్చుకున్నారు. సీఎం రేసులో ముందంజలో ఉన్నవారిలో మీనా కూడా ఒకరు.
7. సీపీ జోషి
రాజస్థాన్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి(CP Joshi) కూడా పార్టీని విజయతీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించారు. అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత కలిగించడం, కాంగ్రెస్ పై ప్రజల్లో ఆగ్రహం కలిగేలా చేయడంలో ప్రముఖ పాత్ర వహించారు. అందరితో సమన్వయం చేసుకుని ఏకతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. ఆయనా సీఎం రేసులో ఉన్నారు.
కాంగ్రెస్ లోనే సీఎం పదవి ఆశావహులు ఎక్కువ ఉంటారన్న ప్రచారం ఇప్పుడు బీజేపీకి కూడా సరిపోతుందేమో? మరి ప్రధాని మోదీ చలువ ఎవరిపై ఉంటుందో చూడాలి.