Operation Dost : సహాయక సామాగ్రితో టర్కీ చేరుకున్న ఏడో ఐఏఎఫ్ విమానం
ABN , First Publish Date - 2023-02-12T10:26:10+05:30 IST
వరుస భూకంపాలతో అల్లకల్లోలంగా మారిన టర్కీ, సిరియాలకు భారత దేశం నుంచి సహాయం కొనసాగుతోంది.
న్యూఢిల్లీ : వరుస భూకంపాలతో అల్లకల్లోలంగా మారిన టర్కీ, సిరియాలకు భారత దేశం నుంచి సహాయం కొనసాగుతోంది. బాధితులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు అవసరమైన అన్ని రకాల ఆహార పదార్థాలు, మందులు, పరికరాలను భారత వైమానిక దళం విమానాల్లో పంపిస్తున్నారు. ‘ఆపరేషన్ దోస్త్’ (Operation Dost) పేరుతో జరుగుతున్న ఈ కార్యకలాపాల్లో భాగంగా ఏడో విమానం ఆదివారం అడానా (Adana) విమానాశ్రయంలో దిగింది.
ఐఏఎఫ్ సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానంలో 13 టన్నుల మెడికల్ ఎక్విప్‌మెంట్‌ను టర్కీ కోసం, 24 టన్నుల సహాయాన్ని సిరియాకు భారత దేశం పంపించింది. ఇండియన్ అంబాసిడర్ డాక్టర్ వీరేందర్ పౌల్, డిఫెన్స్ అటాచ్ కల్నల్ మనూజ్ గార్గ్, టర్కీ ప్రభుత్వ అధికారులు ఈ కన్‌సైన్‌మెంట్‌ను స్వీకరించారు. టర్కిష్ ఫారిన్ అఫైర్స్ మినిస్ట్రీ తరపున అంబాసిడర్ మెహ్మెత్ ఈ కన్‌సైన్‌మెంట్‌ను స్వీకరించారు.
నిద్రపోవడానికి చాపలు, జనరేటర్ సెట్లు, సోలార్ ల్యాంప్స్, టార్పాలిన్లు, దుప్పట్లు, వెంటిలేటర్ మెషిన్స్, అనస్థీషియా మెషిన్స్, ఇతర పరికరాలు, ఈసీజీ, పేషెంట్ మానిటర్, సిరంజ్ పంప్స్, గ్లూకోమీటర్, పారా ఫీల్డ్ హాస్పిటల్ కోసం మందులు ఈ విమానంలో ఉన్నాయి. ఇండియన్ ఆర్మీ ఆసుపత్రిలో రోజుకు 400 మంది రోగులకు చికిత్స చేస్తున్నారు.
ఆపరేషన్ దోస్త్‌లో భాగంగా ఈ ఏడో విమానం శనివారం బయల్దేరింది. దీనిలో ప్రాణాలను కాపాడే మందులు, సహాయక సామాగ్రి, అత్యంత విషమ పరిస్థితుల్లో ఉండే రోగులను కాపాడే ఔషధాలు, మొబైల్ ఆసుపత్రి, ప్రత్యేక నైపుణ్యంగల గాలింపు, సహాయక బృందాలు ఉన్నాయి.
ఈ విమానం మొదట సిరియా రాజధాని నగరం డమాస్కస్‌కు వెళ్లి, ఆ దేశానికి కేటాయించిన సహాయాన్ని అందజేసింది. ఆ తర్వాత అడానా విమానాశ్రయానికి వెళ్లి, టర్కీకి సహాయాన్ని అందజేసింది.