Google : అమ్మడూ! సరసాలు చాలించు అన్నందుకు పురుషుడి ఉద్యోగం ఊడింది
ABN , First Publish Date - 2023-01-30T16:18:09+05:30 IST
ఉద్యోగులను వదిలించుకోవడానికి కంపెనీల యాజమాన్యాలు రకరకాల కారణాలు చెప్తూ ఉంటాయి. కొన్నిసార్లు పురుషులు
న్యూఢిల్లీ : ఉద్యోగులను వదిలించుకోవడానికి కంపెనీల యాజమాన్యాలు రకరకాల కారణాలు చెప్తూ ఉంటాయి. కొన్నిసార్లు పురుషులు తమ తోటి ఉద్యోగినులను వేధించినందుకు ఉద్యోగాలను కోల్పోతూ ఉంటారు. కానీ రియాన్ ఓలోహాన్ (Ryan Olohan-48) పరిస్థితి సరికొత్తగా కనిపిస్తోంది. మహిళా బాస్ బహిరంగంగా సరసమాడటాన్ని వ్యతిరేకించినందుకు ఆయన తన ఉద్యోగాన్ని కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు.
గూగుల్ మాజీ ఉద్యోగి రియాన్ ఓలోహాన్ దాఖలు చేసిన వ్యాజ్యంలో వెల్లడించిన వివరాల ప్రకారం, టిఫానీ మిల్లర్ (Tiffany Miller) గూగుల్ కంపెనీలో ప్రోగ్రామటిక్ మీడియా డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. అదే కంపెనీలో ఫుడ్, బెవరేజెస్, రెస్టారెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా రియాన్ ఓలోహాన్‌కు పదోన్నతి లభించడంతో, 2019 డిసెంబరులో ఫిగ్ అండ్ ఆలివ్‌లో కంపెనీ మీటింగ్ జరిగింది. దీనిలో ఆల్కహాల్ సరఫరా కూడా జరిగింది. ఆ సమయంలో ఓలోహాన్ వద్దకు మిల్లర్ వచ్చి, సరస సంభాషణ ప్రారంభించింది. అతని శరీరాన్ని సుతారంగా నిమురుతూ, ‘నీ బాడీ సూపర్’ అంది. తనకు పెళ్లయింది కానీ, మజా లేదని చెప్పింది. ఈ కంపెనీ టీమ్‌లో ఓలోహాన్‌తోపాటు మిల్లర్ కూడా ఉన్నారు. తాను ఆసియన్ మహిళనని చెప్తూ, ‘నీకు ఆసియన్ మహిళలంటే చాలా ఇష్టమని నాకు తెలుసు’ అని మిల్లర్ చెప్పింది. ఓలోహాన్ భార్య కూడా ఆసియన్ మహిళే కావడం గమనార్హం.
టిఫానీ మిల్లర్ సరసాలను భరించలేకపోయిన రియాన్ ఓలోహాన్ తక్షణమే అక్కడి నుంచి వెళ్లిపోయి, కొన్ని రోజుల తర్వాత మానవ వనరుల శాఖ (HR Department)కు ఫిర్యాదు చేశారు. కానీ ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఓ శ్వేతజాతి పురుషునిపై ఓ మహిళ ఫిర్యాదు చేస్తే, దర్యాప్తు జరిగి ఉండేదనే భావనను ఆయనకు కల్పించారు. మరోవైపు ఆయన కొలీగ్స్ కూడా టిఫానీ టిఫానీయేనని వ్యాఖ్యానించారు. (టిఫానీ అనేది ఖరీదైన ఆభరణాల బ్రాండ్).
హెచ్ఆర్‌కు ఫిర్యాదు చేసినందుకు ఓలోహాన్‌పై టిఫానీ కక్ష సాధింపు చర్యలు ప్రారంభించారు. ప్రతి చిన్న విషయానికీ తప్పుడు ఫిర్యాదులు చేస్తూ ఉండేవారు. 2021 డిసెంబరులో ఓ గూగుల్ ఈవెంట్‌లో తాగిన మైకంలో ఉన్న టిఫానీ బహిరంగంగా ఓలోహాన్‌ను మందలించారు. ఆ తర్వాత ఆమె ఆయనను క్షమాపణ కోరారు. కానీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు. 2022 ఏప్రిల్‌లో ఓ బార్‌లో మళ్లీ అదేవిధంగా ప్రవర్తించారు. ఆమె ఆయనతో లైంగికపరమైన సరససల్లాపాలు కోరుకున్నట్లు, అందుకు ఆయన తిరస్కరించినట్లు, అప్పటి నుంచి ఆమె ఆయనను వేధిస్తున్నట్లు గూగుల్ యాజమాన్యానికి తెలిసినప్పటకీ, ఆమెపై చర్య తీసుకోలేదు.
2022 జూలైలో ఓ మేల్ వర్కర్‌ను తొలగించి, వుమన్ ఎంప్లాయీని చేర్చుకోవాలని తన సూపర్‌వైజర్‌కు చెప్పారని, దీంతో ఆయన తనను ఉద్యోగం నుంచి తొలగించారని ఓలోహాన్ ఈ వ్యాజ్యంలో పేర్కొన్నారు. దీంతో గూగుల్‌తో తనకుగల 16 సంవత్సరాల అనుబంధం తెగిపోయిందని వాపోయారు. తనకు ఏడుగురు పిల్లలు ఉన్నారని తెలిపారు. తాను కంపెనీ ఉద్యోగులతో కలుపుగోలుగా ఉండటం లేదని, వారి నడక తీరుపై వ్యాఖ్యలు చేస్తూ ఉంటానని ఆరోపిస్తూ తనను ఉద్యోగం నుంచి తొలగించారని తెలిపారు. తనకు నష్టపరిహారం చెల్లించాలని గూగుల్‌ను, టిఫానీ మిల్లర్‌ను ఆదేశించాలని కోరారు. తాను ప్రస్తుతం క్లిక్ గ్రూప్‌లో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ గ్రోత్‌గా పని చేస్తున్నానని తెలిపారు.