Indigo : విమానంలో ఎయిర్ హోస్టెస్‌ను వేధించిన మందు బాబు.. అమృత్‌సర్‌లో అరెస్ట్..
ABN , First Publish Date - 2023-05-15T15:12:13+05:30 IST
మద్యపాన ప్రియులు విమానాల్లో దారుణంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. పోలీసులు, విమానయాన సంస్థలు
అమృత్‌సర్ : మద్యపాన ప్రియులు విమానాల్లో దారుణంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. పోలీసులు, విమానయాన సంస్థలు తీసుకుంటున్న చర్యలు ఇటువంటి అనాగరికులను అడ్డుకోలేకపోతున్నాయి. తాజాగా దుబాయ్ నుంచి అమృత్‌సర్ వచ్చిన విమానంలో ఓ మందుబాబు పూటుగా మద్యం సేవించి, విమానంలోని ఎయిర్ హోస్టెస్‌ను వేధించినట్లు కేసు నమోదైంది. ఈ విమానం అమృత్‌సర్‌లో దిగిన వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, దుబాయ్ నుంచి అమృత్‌సర్ వచ్చిన ఇండిగో విమానం 6ఈ 1428లో రాజిందర్ సింగ్ అనే ప్రయాణికుడు దారుణంగా ప్రవర్తించారు. ఆయన మద్యం మత్తులో ఓ ఎయిర్ హోస్టెస్‌ను వేధించారు. ఆమెతో అనుచితంగా ప్రవర్తించారు. ఈ విమానం ఆదివారం రాత్రి 8 గంటలకు అమృత్‌సర్‌లో దిగింది. వెంటనే ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజిందర్ సింగ్ పంజాబ్‌లోని జలంధర్, కోట్లి గ్రామస్థుడని వెల్లడైంది. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలావుండగా, ఇటీవల న్యూయార్క్-న్యూ ఢిల్లీ అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో విపరీతంగా మద్యం సేవించిన ఓ వ్యక్తి ఓ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది నవంబరులో ఎయిరిండియా విమానంలో ఓ వ్యక్తి మద్యం మత్తులో సహ ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశారని కేసు నమోదైంది. కోర్టు ఆయనకు బెయిలు మంజూరు చేసింది.
ఇవి కూడా చదవండి :
India and America : అమెరికాతో భారత్ వ్యూహాత్మక చర్చలు వచ్చే నెలలో
Church Pastor: కడుపు మాడ్చుకొని చనిపోతే జీసస్‌ను కలుస్తారు!