Aadhaar Linked: ఆధార్‌ అనుసంధానానికి ఇంటింటికీ ఈబీ ఉద్యోగులు

ABN , First Publish Date - 2023-02-12T07:27:30+05:30 IST

విద్యుత్‌ కనెక్షన్‌లతో ఆధార్‌ వివరాలను అనుసంధానం చేయడానికి ప్రకటించిన గడువు నాలుగు రోజులే మిగిలి ఉండటంతో విద్యుత్‌ బో

Aadhaar Linked: ఆధార్‌ అనుసంధానానికి ఇంటింటికీ ఈబీ ఉద్యోగులు

చెన్నై, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ కనెక్షన్‌లతో ఆధార్‌ వివరాలను అనుసంధానం చేయడానికి ప్రకటించిన గడువు నాలుగు రోజులే మిగిలి ఉండటంతో విద్యుత్‌ బోర్డు(Electricity Board) ఉద్యోగులు ఇంటింటికీ వెళ్ళి అనుసంధాన పనుల్లో నిమగ్నమవుతున్నారు. రాష్ట్రమంతటా గతేడాది నవంబర్‌ 15 నుంచి విద్యుత్‌ కనెక్టన్లతో ఆధార్‌ వివరాలను అనుసంధానం చేసే పనులు ప్రారంభమయ్యాయి. తొలుత ప్రజలు ఆధార్‌ వివరాలను అనుసంధానం చేయడానికి తటపటాయించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి అని లేకుంటే విద్యుత్‌ కనెక్షన్లను తొలగిస్తామని హెచ్చరింది. దీనితో ప్రజలు ఆధార్‌ వివరాలను అనుసంధానం చేయడానికి ఆసక్తి చూపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.67 కోట్ల విద్యుత్‌ వినియోగదారులు ఆధార్‌ వివరాలను అనుసంధానం చేయడానికి విద్యుత్‌ బోర్డ్‌ అధికారులు డిసెంబర్‌ 31 వరకు గడువు విధించారు. ఆ తర్వాత ఆ గడువును జనవరి 31 దాకా పొడిగించారు. చివరకు ఈ నెల 15 వరకు గడువును పెంచారు. ఈ పరిస్థితులలో ఈ గడువు ముగియటానికి నాలుగు రోజులు మాత్రమే ఉండటంతో ఇప్పటివరకూ ఆధార్‌(Aadhaar) వివరాలు అనుసంధానం చేయని విద్యుత్‌ కనెక్షన్లు కలిగినవారి వివరాలను సేకరించి ఇంటింటికీ వెళ్ళి అనుసంధాన పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. అద్దె ఇళ్లలో ఉన్నవారిని కలుసుకుని ఇంటి యజమానుల ఫోన్‌ నెంబర్లు తీసుకుని వారికి ఫోన్‌ చేసి ఆధార్‌ వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రెండువేలమందికి పైగా విద్యుత్‌ బోర్డు ఉద్యోగులు ప్రస్తుతం ఇళ్ళచుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.

Updated Date - 2023-02-12T07:27:32+05:30 IST