Aadhaar: ‘గృహలక్ష్మి’కి శ్రీకారంతో... ఆధార్ కేంద్రాలు కిటకిట
ABN , First Publish Date - 2023-07-26T11:08:44+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న గ్యారెంటీ పథకాల దరఖాస్తులకు ఆధార్(Aadhaar) తప్పనిసరిగా జత చేయాల్సి ఉం
- 100 టోకెన్ల కోసం ఆరేడువందల మంది
- గ్యారెంటీ పథకాలన్నింటికి ఆధారే ఆధారం
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న గ్యారెంటీ పథకాల దరఖాస్తులకు ఆధార్(Aadhaar) తప్పనిసరిగా జత చేయాల్సి ఉండడంతో వాటి కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ఆధార్ లేకుంటే గ్యారెంటీలకు ఎటువంటి ఆధారమే లేదనే పరిస్థితి ఏర్పడింది. ఆధార్ కార్డు మినహా మిగిలిన ఏ కార్డును పరిగణలోకి తీసుకోవడం లేదు. శక్తి గ్యారెంటీ కార్డుకు ఆధార్ ద్వారానే అవకాశం కల్పించారు. దీంతో ప్రతి మహిళా చేతిలో ఆధార్ లేకుండా ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఆధార్ కార్డుల ప్రక్రియ ప్రారంభించి దశాబ్ద కాలం ముగిసింది. అప్పట్లో ఇదో గుర్తింపు కార్డు మాత్రమేనని భావించారు. కానీ ప్రస్తుతం ఆధారే కీలకమైంది. గతంలో ఆధార్‌లో ఎటువంటి తప్పులు ఉన్నా, ఫొటో బాగలేకున్నా ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఆధార్ లేదంటే ఓటరు కార్డు లేదా ఇతరత్రా గుర్తింపు కార్డు ద్వారా పనులు చేసుకునేవారు. ప్రస్తుతం ఆధార్(Aadhaar) తప్పనిసరి కావడంతో పాటు ఏమాత్రం తప్పులు ఉన్నా పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇలా ఆధార్ కార్డులో లోపాలను సరిదిద్దుకునేందుకు జనం బారులు తీరుతున్నారు. తొలుత శక్తి గ్యారెంటీ ద్వారా ఉచితంగా బస్సుల్లో ప్రయాణించేందుకు కర్ణాటకకు చెందిన ఆధార్ కార్డు అయితే చాలు అనేవారు. గృహజ్యోతి గ్యారెంటీ లబ్ధి పొందాలంటే సొంతిల్లు అయినా లేక అద్దె ఇల్లు అయినా ఆధార్ వివరాలు సమగ్రంగా ఉండాలనే నిబంధన ఉంది. రెండు పథకాల దాకా బాగానే ఉన్నా అన్నభాగ్య గ్యారెంటీ సద్వినియోగం చేసుకోవాలంటే లబ్ధిదారుల పేరు ఇతరత్రా వివరాలు తప్పులుంటే సాధ్యం కావడంలేదు. రేషన్‌కార్డు యజమానికి చెందిన ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా నంబరుకు లింక్ ఉండాలనే షరతు ఉంది. అన్నభాగ్య ద్వారా కేంద్రం అందించే ఐదు కిలోల బియ్యం మాత్రమే ఇస్తుండగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఐదు కిలోల బియ్యానికి ప్రత్యామ్నాయంగా నగదు బదిలీ చేస్తున్నారు.
రేషన్‌కార్డు యజమానికి బ్యాంకు ఖాతా లేకుంటే తప్పనిసరిగా ఓపెన్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడా ఆధార్‌లో ఏమాత్రం తప్పులు ఉన్నా బ్యాంకు అకౌంట్ ఓపెన్ కావడం లేదు. దీంతో ఆధార్ కేంద్రం వెళ్లడం తప్పనిసరిగా మారింది. ఇక వీటన్నింటి కంటే కీలకమైనది గృహలక్ష్మి గ్యారెంటీ పథకం. కుటుంబ యజమానికి నెలకు రెండువేలు ఇచ్చే పథకమిది. ప్రస్తుతం ప్రకటించిన అన్ని పథకాలతో పోల్చితే ఇదే కీలకమైనది. నెలకు రెండువేలు వదులుకునేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. రేషన్‌కార్డులో యజమానిగా ఉండటంతో పాటు ఆధార్ సక్రమంగా ఉండాల్సి ఉన్నందున ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. బెంగళూరు వన్ కేంద్రాలతో పాటు ప్రత్యేకమైన ఆధార్ కేంద్రాల్లో తప్పులు సరిదిద్దే ప్రక్రియ సాగుతోంది. బెంగళూరు(Bangalore) సహా కర్ణాటక వ్యాప్తంగా పొరుగు రాష్ట్రాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, గోవా, మహారాష్ట్ర(Tamil Nadu, Andhra Pradesh, Telangana, Kerala, Goa, Maharashtra)కు చెందిన లక్షలాది మంది నివసిస్తున్నారు. గతంలో ఆధార్ ఎక్కడైనా ఒక్కటే అని భావించేవారు. ఇతర రాష్ట్రాల నుంచి దశాబ్దాల కాలం కిందట వచ్చిన వారు సైతం అక్కడే గుర్తింపు కార్డులు కలిగి ఉండేవారు. కానీ గ్యారెంటీలు పొందాలంటే తప్పనిసరిగా కర్ణాటకలో నివసించేవారే వీటితో పాటు రేషన్‌కార్డుల్లో యజమానిగా ఉండటమనేది కూడా కీలకం కావడంతో ఇటు బెంగళూరు వన్‌తో పాటు ఫుడ్ ఆఫీసులు, ఆధార్ కేంద్రాల చుట్టూ బారులు తీరుతున్నారు. ప్రతి ఆధార్ కేంద్రం వద్ద రోజుకు 100 దాకా టోకెన్లు ఇచ్చేవారు. గ్యారెంటీలు ప్రారంభించిన జూన్ నుంచి ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఏకంగా 200-300 మంది దాకా వచ్చేవారు. కానీ అన్నభాగ్య, గృహలక్ష్మి పథకాలకు దరఖాస్తులు చేసుకునేందుకు ఆధార్‌లో తప్పులు సరిదిద్దుకునేందుకు రోజుకు 400-500 మంది క్యూకడుతున్నారు. ప్రతి గ్యారెంటీ కూడా మహిళలనే లబ్ధిదారులు చేర్చుతుండటంతో వారే అధికంగా ఉంటున్నారు. వారివెంట పర్యవేక్షకులుగా కుటుంబీకులు వచ్చి గంటల తరబడి ఆధార్ కేంద్రాల వద్ద గడిపే పరిస్థితి కొనసాగుతోంది. బెంగళూరులో ఆధార్ కేంద్రాలు, బ్యాంకు ల్లో ప్రత్యేక విభాగాలు, బెంగళూరు వన్ వంటివి కలిపితే పదుల సంఖ్యలో ఉన్నాయి. అయినా ప్రతి చోటా భారీగా క్యూలు కడుతున్నారు. ఇదే పద్దతి రాష్ట్రమంతటా కొనసాగుతోంది. ఆధార్ కేంద్రాల్లో టోకెన్లు పొందాక వారం పదిరోజులు వేచి ఉండే పరిస్థితి కొనసాగుతోంది.