Sanatan Dharma Row: ఒక చిన్న నాయకుడు చేసిన వ్యాఖ్యల్ని ‘ఇండియా’ కూటిమికి ఆపాదించలేం.. ఆప్ లీడర్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-09-12T21:34:08+05:30 IST

‘సనాతన ధర్మం’పై డీఎంకే లీడర్, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా.. బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యల్ని అడ్డం పెట్టుకొని ఇండియా కూటమిపై...

Sanatan Dharma Row: ఒక చిన్న నాయకుడు చేసిన వ్యాఖ్యల్ని ‘ఇండియా’ కూటిమికి ఆపాదించలేం.. ఆప్ లీడర్ సంచలన వ్యాఖ్యలు

‘సనాతన ధర్మం’పై డీఎంకే లీడర్, నటుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో ఎంత దుమారం రేపాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా.. బీజేపీ నేతలు ఈ వ్యాఖ్యల్ని అడ్డం పెట్టుకొని ఇండియా కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిజానికి.. స్టాలిన్ చేసిన ఈ వ్యాఖ్యలతో ఇండియా కూటమికి సంబంధం లేదు. పైగా.. ఇండియా కూటమిలోని చాలామంది నేతలు ఈ వ్యాఖ్యల్ని ఖండించారు కూడా! అయినప్పటికీ.. బీజేపీ మాత్రం ‘సనాతన ధర్మాన్ని’ నిర్మూలించాలని ఇండియా కూటమి ప్రయత్నిస్తోందంటూ ఆరోపణలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ చేసిన వ్యాఖ్యలతో ఇండియా కూటమికి ఎలాంటి సంబంధం లేదంటూ తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ ఛద్దా పేర్కొన్నారు.

సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యల్ని ఖండించిన రాఘవ్ చద్ధా.. ఒక పార్టీకి చెందిన చిన్న నాయకుడు చేసిన వ్యాఖ్యలను ఇండియా కూటమి అధికారిక స్టాండ్‌గా పరిగణించలేమని స్పష్టం చేశారు. తానూ సనాతన ధర్మానికి చెందినవాడినేనని, అలాంటి వ్యాఖ్యల్ని తాను ఖండిస్తున్నానని అన్నారు. ఏ మతంపై కూడా అలాంటి వ్యాఖ్యలు చేయకూడదని, అన్ని మతాలను సమానంగా గౌరవించాలని సూచించారు. ప్రస్తుతం దేశం ఎదుర్కుంటున్న ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి పెద్ద సమస్యల్ని లేవనెత్తడానికే ఇండియా కూటమి ఏర్పడిందని క్లారిటీ ఇచ్చారు. ఒక చిన్న నాయకుడు ఇచ్చిన స్టేట్‌మెంట్‌.. ఇండియా కూటమి అధికారిక స్టాండ్‌ కాదని, కూటమికి ఈ వ్యాఖ్యలతో సంబంధం లేదని తేల్చి చెప్పారు.


కాగా.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవడం కోసం రెండు డజనుకు పైగా ప్రతిపక్ష పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి. 14 మంది సభ్యులు గల సమన్వయ కమిటీలో రాఘవ్ చద్ధా ఓ కీలక సభ్యుడిగా ఉన్నారు. బుధవారం ఢిల్లీలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ నివాసంలో కమిటీ సమావేశం జరగనుంది. దీని గురించి రాఘవ్ మాట్లాడుతూ.. ‘‘ఈ సమావేశంలో తాము దేశంలోని సమస్యల గురించి చర్చిస్తాం. ఆ సమస్యలు ప్రజలకు ఇంటింటి ప్రచారం, ర్యాలీలతో పాటు ఇంకా ఎలాంటి మార్గాల ద్వారా చేరవేయాలన్న అంశంపై చర్చలు జరుగుతాయి. రాష్ట్రాల వారీగా చర్చలు చేపడతాం’’ అని చెప్పుకొచ్చారు.

ఇదే సమయంలో ప్రధానమంత్రి సభ్యుడెవరని ప్రశ్నించగా.. తమ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రేసులో లేదని రాఘవ్ తెలిపారు. ‘‘మేము ఈ కూటమిలో నమ్మకమైన సైనికులం. ప్రధానమంత్రి అభ్యర్థి రేసులో మా పార్టీ నుంచి ఎవ్వరూ లేరు. మా కూటమిలో చాలామంది సమర్థులు ఉన్నారు. కానీ.. NDAలో ఎవరైనా నిలబడి నితిన్ గడ్కరీ గానీ, అమిత్ షా గానీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారని చెప్పగలరా..? మా కూటమిలో చాలామంది సమర్థులైన పాలకులు ఉన్నారని నేను ఇక్కడ నిరూపించాలనుకుంటున్నాను. కానీ.. వారికి ఎవరూ లేరు. వాళ్లు కేవలం ఒక నేత పేరు మాత్రమే తీసుకుంటారు’’ అని రాఘవ్ వివరించారు.

Updated Date - 2023-09-12T21:34:08+05:30 IST