Owaisi: గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్ విడుదలలో నితీశ్ తీరును తూర్పారపట్టిన ఒవైసీ
ABN , First Publish Date - 2023-04-27T16:32:30+05:30 IST
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై (Bihar CM Nitish Kumar) ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (AIMIM chief Asaduddin Owaisi) కన్నెర్ర చేశారు.
పాట్నా, హైదరాబాద్: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై (Bihar CM Nitish Kumar) ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (AIMIM chief Asaduddin Owaisi) కన్నెర్ర చేశారు. తెలుగు దళిత ఐఏఎస్ అధికారి జి.కృష్ణయ్య (Gopalganj district magistrate G. Krishnaiya) హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తుండగానే బీహార్ మాజీ ఎంపీ, డాన్, గ్యాంగ్‌స్టర్ ఆనంద్ మోహన్‌ను (gangster turned politician Anand Mohan Singh) సహర్స జైలు నుంచి విడుదల చేయడంపై మండిపడ్డారు. ఆనంద్ మోహన్ విడుదల కోసం ఏప్రిల్ పదిన జైలు మాన్యువల్‌లో మార్పులు చేయించడాన్ని ఒవైసీ తీవ్రంగా తప్పుబట్టారు. జైలు మాన్యువల్‌లో మార్పులతో ఆనంద్ మోహన్‌తో పాటు బీహార్‌లో 14 ఏళ్ల జైలు శిక్ష పూర్తి చేసుకున్న 26 మంది కూడా విడుదల అయ్యారు. వాస్తవానికి మాన్యువల్‌లో మార్పులు చేయకపోతే ఆనంద్ మోహన్ మరో ఆరేళ్లు జైళ్లోనే ఉండాలి. అయితే తన పెద్దకొడుకు చేతన్ ఆనంద్ నిశ్చితార్థం కోసం పెరోల్‌పై బయటకు వచ్చిన ఆనంద్ మోహన్‌కు వేడుకలో ఉండగానే జైలు నుంచి శాశ్వతంగా విడుదలవుతున్న సమాచారం అందించారు. ఆ వేడుకకు బీహార్ సీఎం నితీశ్, డిప్యూటీ సీఎం తేజస్వీ, పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు.
ఓ కలెక్టర్ హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తిని జైలు మాన్యువల్‌లో మార్పులతో విడిచిపెట్టడాన్ని బీహార్ ఐఏఎస్ అధికారులు ప్రశ్నించకపోవడంపై ఒవైసీ విస్మయం వ్యక్తం చేశారు. నీతీశ్ ప్రభుత్వం ఆనంద్ మోహన్‌ను విడుదల చేయడాన్ని కృష్ణయ్య భార్య ఉమ ఇప్పటికే తప్పుపట్టారు. ఈ విషయంలో ప్రధాని మోదీ(PM Modi) జోక్యం చేసుకోవాలని కోరారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి (Bahujan Samaj Party supremo Mayawati) కూడా ఆనంద్ మోహన్ విడుదలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎన్ని విమర్శలు వస్తున్నా ఆనంద్ మోహన్‌ను విడుదల విషయంలో నితీశ్ వెనకడుగు వేయలేదు. ప్రస్తుత ఆర్జేడీ-జేడియూ-కాంగ్రెస్ సంకీర్ణ సర్కారులో రాజ్‌పుత్ నాయకుల ఒత్తిడి మేరకే నితీశ్ ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. రాజ్‌పుత్‌లను ఆకర్షించడం ద్వారా వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఓ పక్క విపక్షాల ప్రధాని అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్న నితీశ్ ప్రస్తుతం విమర్శల పాలౌతున్నారు. క్రిమినల్స్‌ను విడిచిపెట్టే ప్రభుత్వంపై ప్రజలకు ఏం నమ్మకం ఉంటుందని ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించారు.
ఆనంద్ మోహన్ ప్రస్తుత వయసు 69 సంవత్సరాలు. 1994లో నాటి గోపాల్‌గంజ్ కలెక్టర్ అయిన జి. కృష్ణయ్యను హత్య చేయించిన కేసులో ఆనంద్ మోహన్ 2006లో దోషిగా తేలాడు. 2007లో ఆనంద్ మోహన్‌కు ఉరిశిక్ష పడింది. అయితే ఆ శిక్షను పాట్నా కోర్ట్ 2008లో జీవిత ఖైదుగా మార్చింది. నాటి నుంచి జైళ్లో ఉన్న ఆనంద్ మోహన్ ప్రస్తుతం పూర్తి స్థాయిలో విడుదల చేసేందుకు నితీశ్ ప్రభుత్వం జైలు మాన్యువల్‌లో మార్పులు తీసుకొచ్చింది. ఆనంద్ మోహన్ కుమారుడు చేతన్ ఆనంద్ ఆర్జేడీ ఎమ్మెల్యే. ఆనంద్ మోహన్ భార్య లవ్‌లీ ఆనంద్ (Lovely Anand, wife of Anand Mohan Singh) ఆర్జేడీ మాజీ ఎంపీ. తన భర్తను విడుదల చేసిన నితీశ్ ప్రభుత్వంపై ఆమె ప్రశంసలు కురిపిస్తున్నారు.