Air India Flight: మహిళపై మూత్ర విసర్జన చేసిన ప్రయాణికుడిపై 30 రోజుల నిషేధం

ABN , First Publish Date - 2023-01-04T16:48:48+05:30 IST

న్యూయార్క్-ఢిల్లీ విమానంలో ప్రయాణిస్తూ మద్యం మత్తులో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణికుడిపై ఎయిర్ ఇండియా చర్యలు..

Air India Flight: మహిళపై మూత్ర విసర్జన చేసిన ప్రయాణికుడిపై 30 రోజుల నిషేధం

న్యూఢిల్లీ: న్యూయార్క్-ఢిల్లీ విమానంలో ప్రయాణిస్తూ మద్యం మత్తులో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన ప్రయాణికుడిపై ఎయిర్ ఇండియా (Air India) చర్యలు తీసుకుంది. తమ విమానాల్లో ప్రయాణించకుండా 30 రోజుల పాటు అతనిపై నిషేధం (Ban) విధించింది. అతడిని నో-ఫ్లై జాజితాలో చేర్చాలని డీజీసీఏ (DGCA)కు సిఫారసు చేసినట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. ప్రస్తుతం దీనిపీ డీజీసీపీ కమిటీ దర్యాప్తు చేస్తోంది. నవంబర్ 26వ తేదీన న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఏఐ-102 విమానంలో మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు బిజినెస్ క్లాస్‌ (Business class)లో కూర్చున్న ఒక మహిళ దగ్గరకు వచ్చి ఆమెపై మూత్రవిసర్జన చేసిన విషయాన్ని ఎయిర్ ఇండియా ధ్రువీకరించింది.

బాధితురాలి లేఖ...

నవంబర్ 26న జరిగిన ఈ భయానక ఘటనపై బాధితురాలు టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌కు లేఖ రాశారు. భోజనం తర్వాత లైట్లు ఆర్పేసిన సమయంలో నిందితుడు తన వద్దకు వచ్చి తనపై మూత్ర విసర్జన చేశాడని, అతను పూర్తిగా మద్యం మత్తులో ఉన్నాడని ఆమె తెలిపారు. అతను కదలకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపొమ్మని తక్కిన ప్రయాణికులు మందలించారని, అప్పుడే అతను అక్కడి నుంచి కదలాడని తెలిపింది. తన బ్యాంగు, షూస్, బట్టలు తడిసిపోయాయని, విమాన సిబ్బంది వేరే చోట తనను కూర్చోబెట్టి, ఆ సీటును షీట్లతో కవర్ చేసి, డిస్‌ఇన్ఫెక్టెంట్‌తో స్ప్రే చేసి గంట తర్వాత అక్కడకు వెళ్లిపొమ్మారని తెలిపింది. బిజినెస్ సీట్లు ఖాళీగా ఉన్నా తనకు సీటు కేటాయించలేదని వాపోయారు. అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణికుడిపై సిబ్బంది ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో అతను దర్జాగా వెళ్లిపోయాడని వాపోయింది. ఈ ఘటన జరిగిన కొన్ని వారాల తర్వాత ఎయిర్ ఇండియా కేసు నమోదు చేసి, అనుచితంగా ప్రవర్తించిన ప్రయాణికుడిని నో-ఫ్లై జోన్‌లో పెట్టాలని సిఫారసు చేసింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎయిర్‌ ఇండియను డీజీసీఏ ఆదేశించింది. బాధితురాలు రాసిన లేఖను ఓ మీడియా సంస్థ బయటపెట్టడంతో ఈ దారుణం గురించి అందరికీ తెలిసింది.

Updated Date - 2023-01-04T16:49:16+05:30 IST